విద్యార్థినిపై దాష్టీకం

13 Dec, 2013 00:31 IST|Sakshi

సాక్షి, ముంబై: ఆటోలో ఓ 16 ఏళ్ల విద్యార్థినితో 56 ఏళ్ల వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రతిఘటించిన ఆమెను నడుస్తున్న ఆటోలోంచి బయటకు నెట్టివేశాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తలకు గాయాలు కావడంతో ఆమెను ములుండ్‌లోని అగ్రవాల్ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. నిందితుడితోపాటు ఆటో డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో మహిళల భద్రత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది.
 
 స్థానిక పోలీసుల కథనం ప్రకారం ములుండ్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల విద్యార్థిని కాలేజీకి వెళ్లేందుకు రోడ్డుపై ఆటో కోసం ఎదురు చూస్తోంది. అంతలో వచ్చిన ఆటోను ఆపేందుకు ప్రయత్నించగా అందులో అప్పటికే  మనోహర్ సుక్సోలే (56) అనే వ్యక్తి ఉన్నాడు. ఆటో ఎక్కిన దగ్గర నుంచి ఆమెతో అతడు అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆటో ఆపాలని ఆ విద్యార్థిని వేడుకున్నా డ్రైవర్ ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆమె కేకలు వేయగా గమనించిన ఇద్దరు యువకులు ఆటోను వెంబడించారు. వెంటనే మనోహర్ ఆమెను ఆటోలో నుంచి బయటకు తోసేశాడు. అయినప్పటికీ ఆ యువకులు కొద్ది దూరం ఆటోను వెంబడించి చివరకు దాన్ని అడ్డుకుని, తర్వాత బాటసారుల సాయంతో కామాంధుడ్ని, ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇందులో ఆటో డ్రైవర్ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు