విలాస భవనాలకు గిరాకీ.. ఈ ఏడాది అదే టాప్

1 Dec, 2023 07:31 IST|Sakshi

రూ.4,063 కోట్ల విలువైన అమ్మకాలు

ఏడు పట్టణాల్లో నమోదు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విలాసవంతమైన ఇళ్లకు (అల్ట్రా లగ్జరీ) అధిక గిరాకీ నెలకొన్నట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో రూ.40 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల అమ్మకాలు రూ. 4,063 కోట్ల మేర నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె పట్టణాల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 58 ఇళ్లు అమ్ముడుపోయాయి.

2022 ఏడాది మొత్తం మీద ఈ విభాగంలో అమ్ముడుడైనవి 13 యూనిట్లుగానే ఉన్నాయి. వీటి విలువ రూ. 1,170 కోట్లుగా ఉంది. ‘‘కరోనా మహమ్మారి తర్వాత నుంచి లగ్జరీ, అల్ట్రా లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరిగాయి. ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐ), అధిక ధనవంతులు (అల్ట్రా హెచ్‌ఎన్‌ఐలు) ఖరీదైన ఇళ్లను పెట్టుబడి కోసం, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా కొనుగోలు చేస్తున్నారు’’అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో స్టాక్‌ మార్కెట్లలో అస్థిరతలు నెలకొన్న నేపథ్యంలో హెచ్‌ఎన్‌ఐలు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేయడం అల్ట్రా లగ్జరీ ఇళ్లకు డివండ్‌ను పెంచినట్టు చెప్పారు.

ముంబై టాప్‌..
ఇక ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో అత్యంత ఖరీదైన ఇళ్లు 58 యూనిట్లు అమ్ముడుపోగా, అందులో 53 యూనిట్లు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో నాలుగు యూనిట్లు అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోనూ ర.40 కోట్ల పైన విలువ చేసే ఒక యూనిట్‌ విక్రయం నమోదైంది. ముంబైలోని 53 యూనిట్లలో మూడు ఇళ్ల ధర రూ. 200 కోట్లపైనే ఉంది. ఏడు ఇళ్ల ధర రూ. 100–200 కోట్ల మధ్య ఉంది.

ఢిల్లీలో రెండు యూనిట్ల ధర రూ.100 కోట్లపైన ఉంది. ‘‘ఇటీవలి కాలంలో సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష అన్ని ఆదాయ వర్గాల వారిలో పెరిగింది. జీవన ప్రమాణాలు, ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇందుకు కారణం. మరింత విలాసవంతమైన ఇల్లును కలిగి ఉండాలన్న ధోరణి ధనవంతుల్లో పెరిగింది’’అని గురుగ్రామ్‌కు చెందిన క్రిసూమి కార్పొరేషన్‌ ఎండీ మోహిత్‌ జైన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు