నీరజ్‌కు మద్దతుగా ఆప్ ఆందోళన

8 Jan, 2014 22:55 IST|Sakshi
నీరజ్‌కు మద్దతుగా ఆప్ ఆందోళన

ముంబై: ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ సస్పెన్షన్ వ్యవహరం ముంబై వర్సిటీలో మంటలు రేపుతోంది. నిజాయితీ గల నీరజ్‌ను విధులకు దూరంగా ఉంచుతూ వైస్ ఛాన్సలర్(వీసీ) రాజన్ వెలుకర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బుధవారం ఆందోళనకు దిగింది. దీనికి వర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్‌ల నుంచి మద్దతు లభించింది. శాంతాక్రజ్‌లోని కలినా క్యాంపస్‌లో జరిగిన ఈ ఆందోళనలో ఆప్ నాయకుడు మయంక్ గాంధీ పాల్గొన్నారు. వర్సిటీ పరిపాలన వ్యవహరాల్లో జరుగుతున్న వివిధ సమస్యలపై నిలదీసినందుకే నీరజ్‌ను సస్పెండ్ చేశారని, ఇది అవినీతి  అంశమేనని ఆయన ఆరోపించారు. ఎటువంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా వీసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సబబు కాదన్నారు. పత్రికలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, మీడియా సమావేశాలు నిర్వహిస్తుండటాన్ని వర్సిటీ నిర్వహణ మండలి సీరియస్‌గా తీసుకోవడాన్ని గాంధీ తప్పుబట్టారు.  మంగళవారం నుంచి నీరజ్‌కు మద్దతుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే సంతకాల సేకరణ చేసిన ఆర్థిక విభాగానికి చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు వాటిని అధికారులకు సమర్పించారు.  తమకు మెరుగైన వసతులు కల్పించేందుకు పోరాడుతున్న నీరజ్‌పై చర్యలు తీసుకోవడాన్ని విద్యార్థులు ఖండించారు.
 
 అయితే నీరజ్‌ను సస్పెండ్ చేసే అధికారం తనకు ఉందని, ఇప్పటికే ఈ విషయంలో శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించానని వీసీ రాజన్ అంటున్నారు. అయితే తనను కావాలనే సస్పెండ్ చేశారని నీరాజ్ అంటున్నారు. గతేడాది డిసెంబర్ 12న మీడియా సమావేశం నిర్వహించిన నీరజ్,  వీసీ తీరు బాగో లేదంటూ ఆరోపణలు చేశారు.
 
 విధుల్లో చేర్చుకోవాలి: ఆప్
 ఇదిలావుండగా సస్పెండ్ చేసిన హతకరేను వెంటనే తిరిగి విధుల్లో చేర్చుకోవాలని రాష్ట్ర ఆప్ విభాగం ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. అవసరమైతే విద్యార్థులు చేసే ఆందోళనల్లో తాము కూడా భాగస్వామ్యులం అవుతామని, అన్యాయం ఎక్కడా జరిగినా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇదంతా చేసేది ప్రజల్లో క్రేజీ కోసం కాదని, అందరికీ న్యాయం కోసమేనని స్పష్టం చేసింది. తమ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు హతేకర్ ప్రయత్నించారని, అందుకే ఆయన్ని సస్పెండ్ చేశారని చెప్పింది. వీసీని సస్పెండ్ చేసి, నీరజ్ చేసిన ఆరోపణలపై ఓ కమిటీని నియమించి విచారించాలని డిమాండ్ చేసింది.
 
 హైకోర్టును ఆశ్రయించిన నీరాజ్ హతేకర్
 ముంబై వర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని మీడియాను తప్పుదారి పట్టించారనే ఆరోపణలపై సస్పెండ్‌కు గురైన ప్రొఫెసర్ నీరజ్ హతేకర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై చట్టవిరుద్ధంగా చర్యలు తీసుకున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తనను సస్పెండ్ చేసే అధికారం వైస్ ఛాన్సలర్‌కు లేదని, వర్సిటీ నిర్వాహక మండలికి ఉంటుందని అందులో వివరించారు. అలాగే తనపై చర్యలు తీసుకోవడానికి గల కారణమేంటనేది కూడా స్పష్టంగా పేర్కొనలేదన్నారు. సస్పెన్షన్ లేఖ విషయంలోనూ నిబంధనల ప్రకారం నడుచుకోలేదని తెలిపారు. మీడియా సమావేశం నిర్వహించే 48 గంటల ముందు ప్రెస్‌నోట్ అందరి సభ్యులకు పంచానని అన్నారు. అయితే అందులో ఏమైనా తప్పిదం ఉంటే తనకు చెప్పి ఉంటే బాగుండేదని తెలిపారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని తన సస్పెన్షన్ కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. కళాశాలల నుంచి విద్యార్థుల వార్షిక ఫీజులు రాబట్టడం, కొందరికి అర్హత లేకున్నా ఉన్నత స్థాయిల్లో ఉన్నారని, లెక్చరర్ హాల్‌లు పనికిరాకుండా ఉన్నాయని, పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతుందని, పీహెచ్‌డీ అడ్మిషన్‌లు కూడా నిబంధనల ప్రకారం నడవడం లేదని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో నీరజ్ వర్సిటీ పాలన యంత్రాంగ లోపాలను ఎత్తిచూపిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు