ముంగిట్లోకి ఆస్పత్రి!

5 Feb, 2014 23:58 IST|Sakshi
న్యూఢిల్లీ: నగరవాసులకు అత్యుత్తమ వైద్యసేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఆస్పత్రుల వరకు వెళ్లి, వైద్యుల కోసం పడిగాపలు పడుతూ అవస్థలు పడే పరిస్థితి నుంచి రోగులకు విముక్తి కల్పించనుంది. రోగి ముంగిట్లోకే ఆస్పత్రిని తీసుకొచ్చే సరికొత్త పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనుంది. మరో ఆరునెలల్లో ఈ సేవలు నగరవాసులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం ఐసీయూతోసహా అత్యాధునిక వైద్య సదుపాయాలున్న 100 అంబులెన్స్‌లను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటిదాకా ఇటువంటి సేవలు కేవలం ప్రమాదాలకు గురైనవారికి మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఇకపై అందరికీ ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ బుధవారం తెలిపారు. ఈ విషయమై మంత్రి మనీశ్ సిసోడియాతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో పథకం వివరాలను వెల్లడించారు.
 
‘ప్రమాదాలబారిన పడ్డవారికి, అత్యాచారాలకు గురైనవారికి, యాసిడ్ దాడులకు గురైనవారికి, గర్భిణులకు మాత్రమే అందుబాటులో ఉన్న ప్రభుత్వ అంబులెన్స్ వైద్యసేవలు ఇకపై మిగతా రోగులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రజలకు అత్యుత్తమ వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 100 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఇందులో ఐసీయూతోసహా అన్నిరకాల చికిత్సలు చేసే సదుపాయాలు ఉంటాయి. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో 150 అంబులెన్స్‌లు ఉన్నాయి. ఇందులో 26 అంబులెన్స్‌ల్లో మాత్రమే ఐసీయూ సదుపాయం ఉంది. అయితే కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటున్న అంబులెన్సులన్నింటిలోనూ ఐసీయూ సదుపాయం ఉంటుంది.
 
ఇదేకాకుండా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాయంత్రపు ఓపీడీలను కూడా ప్రారంభించనున్నాం. అన్ని ప్రభుత్వ అస్పత్రులకు కంప్యూటరీకరిస్తాం. ఇందుకోసం ప్రయోగాత్మకంగా లోక్‌నారాయణ్ జయ్‌ప్రకాశ్ ఆస్పత్రిలో ఫిబ్రవరి 15న తొలుత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఆస్పత్రి రికార్డులు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక మందుల కొనుగోలుకు సంబంధించి కూడా కేంద్రీకృత విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు కూడా అందుబాటులో ఉండడంలేదన్న రోగుల ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే మిగతా వైద్య పరికరాల కొనుగోలు విషయంలో కూడా ఇదే పద్ధతి పాటిస్తామ’న్నారు.
 
మరిన్ని వార్తలు