మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ దూరం

23 Sep, 2014 22:42 IST|Sakshi

 ముంబై: వచ్చే నెల 15న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం ప్రకటిం చింది. బలమైన నిర్మాణం లేకుండా ఎన్నికల్లో విజయం సాధ్యం కాదని లోక్‌సభ ఎన్నికల ఫలితాల ద్వార తెలిసిందని ఆప్ ప్రతినాధి ప్రీతీ శర్మమీనన్ అన్నారు. వనరుల కొరత, నిధులు సమకూర్చలేని అసమర్థత కారణంగా అనేక మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోరాడటానికి అష్టకష్టాలు పడ్డారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని ఆమె అన్నారు. వాలంటీర్లకు నిత్యం సమీపంగా ఉండేందుకు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం, వారికి శిక్షణనివ్వడం ద్వారా బలమైన కార్యకర్తలు రూపొందగలరని పేర్కొన్నారు. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి లేదా స్వతంత్ర అభ్యర్థులకు కూడా మద్దతునివ్వడం లేదని ప్రీతీశర్మ స్పష్టం చేశారు. ఆప్ సభ్యులెవరైనా ఇతర పార్టీల నుంచి లేదా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగితే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పారు. అయితే తాము ‘జాగ్రుత్-నాగ్రిక్’ పేరిట ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. అవినీతిపరులైన అభ్యర్థులను గుర్తించేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఒక్కో నియోజకవర్గంలో రెండు కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
 

మరిన్ని వార్తలు