అభయ గోల్డ్‌కు రహస్య ఆస్తులు?

9 Nov, 2016 10:53 IST|Sakshi

సాక్షి, అమరావతిబ్యూరో: అభయ గోల్డ్‌ సంస్థకు రహస్య ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి?.. డిపాజిటర్లను ముంచేసిన ఆ సంస్థ డైరెక్టర్లు నిధులను ఎక్కెడెక్కడ పెట్టుబడి పెట్టారు?.. ప్రస్తుతం సీఐడీ పోలీసులు శోధిస్తున్న అంశం ఇదే. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో తొలిచార్జిషీటును సీఐడీ పోలీసులు సోమవారం న్యాయస్థానంలో దాఖలు చేశారు.

సీఐడీ సమర్పించిన ఆస్తుల చిట్టాను పరిశీలించి న్యాయస్థానం కేసు నంబరు కేటాయిస్తుంది. అనంతరం వాదనలు ప్రారంభమవుతాయి. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో భాగంగా అభయ గోల్డ్‌ రహస్య ఆస్తులు ఇంకా ఎక్కడైనా ఉన్నాయా అనే కోణంలో సీడీఐ దృష్టిసారించింది. ఈ కేసులో మిగిలిన 10 చార్జిషీట్ల దాఖలుకు సన్నాహాలు చేస్తూనే రహస్య ఆస్తుల శోధనను ముమ్మరం చేయాలని భావిస్తోంది.

డిపాజిట్లకు, జప్తుచేసిన ఆస్తులకు పొంతన ఏదీ?
అభయ గోల్డ్‌ సంస్థ 2008–2013 మధ్య కాలంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ తదితర రాష్ట్రాల్లో 3.20 లక్షల మంది నుంచి వివిధ కాలపరిమితులతో డిపాజిట్లు సేకరించింది. అధికారికంగా ఎన్ని వందల కోట్లు సేకరించిందన్నది స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ డిపాజిట్ల చెల్లింపులో వైఫల్యం ద్వారా డిపాజిట్‌దారులను దాదాపు రూ.174 కోట్ల మేర మోసగించినట్లు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ మొత్తం 790 ఎకరాలను జప్తుచేసింది. అప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆ భూముల విలువ రూ.25 కోట్లు అని అంచనా వేశారు. మరి మోసం చేసిన రూ.174 కోట్లలో మిగిలిన మొత్తాన్ని ఎక్కడ, ఏ రూపంలో దాచారన్నది సీఐడీకి అంతుచిక్కడంలేదు.

మరిన్ని వార్తలు