టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు

15 Nov, 2023 03:49 IST|Sakshi

హవాలా మార్గంలో చేరినట్టు గుర్తించిన సీఐడీ

ఇతర కుంభకోణాల నిధులు కూడా చంద్రబాబు పార్టీ ఖాతాలోకే

ఈ నిధుల గుట్టు రట్టు చేసేందుకు విచారణ వేగవంతం

మొదట స్కిల్‌ స్కామ్‌లో కార్యాచరణకు ఉపక్రమణ

టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ.. 18న తాము 

కోరిన వివరాలతో సిట్‌ కార్యాలయానికి రావాలని పేర్కొన్న సీఐడీ

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమ నిధుల తరలింపునకు టీడీపీ ప్రధాన కార్యాలయం కేంద్రబిందువుగా మారిందని సీఐడీ గుర్తించింది. వివిధ కుంభకోణాల ద్వారా కొల్ల­గొట్టిన అక్రమ నిధులను గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించినట్టు విశ్వసిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభ­కోణంతోపాటు చంద్రబాబుపై నమోదైన ఫైబర్‌­నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్‌ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనం హవాలా మార్గంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరింది.

ఈ మేరకు సీఐడీ దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. దీంతో టీడీపీ ఖాతాల్లో చేరిన నిధుల లోగుట్టును రట్టు చేసే దిశగా సీఐడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. అందులో మొదటగా స్కిల్‌ స్కామ్‌ కేసులో కార్యాచరణకు ఉపక్రమించింది. ఈ కేసులో టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు జారీ చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 18న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) కార్యాలయానికి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. 

హవాలా మార్గంలో రూ.27 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో కొల్లగొట్టిన రూ.241 కోట్లలో రూ.27 కోట్లు టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరినట్టు సీఐడీ గుర్తించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా చెల్లించిన రూ.371 కోట్లలో రూ.241 కోట్లను డిజైన్‌ టెక్‌ వివిధ మార్గాల ద్వారా చంద్రబాబుకు చేర్చినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అందులో రూ.27 కోట్లను టీడీపీ ఖాతాలో జమ చేసినట్టు సీఐడీ ఇటీవల గుర్తించింది. ఆ నిధులు పార్టీ బ్యాంకు ఖాతాలోకి ఎలా వచ్చాయన్నదానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం. దీనిపై ప్రాథమిక ఆధారాలు సేకరించాక సీఐడీ నెల క్రితం టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది.

బ్యాంకు ఖాతాల లావాదేవీలు వివరాలు తెలపాలని పోస్టు ద్వారా నోటీసులు పంపించింది. దీంతో కంగుతిన్న టీడీపీ బ్యాంకు లావాదేవీల వివరాలను తెలిపేందుకు నాలుగు వారాల గడువు కావాలని సీఐడీకి సమాధానం ఇచ్చింది. నాలుగు వారాల గడువు ముగిశాక కూడా టీడీపీ ఆ నోటీసులకు సమాధానం ఇవ్వలేదు. అంటే టీడీపీ బ్యాంకు ఖాతాల్లో చేరిన నిధుల్లో ఏదో గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమైంది. దాంతో సీఐడీ మరింత దూకుడు పెంచింది. టీడీపీ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను తెలపాలని టీడీపీ ప్రధాన కార్యాలయానికి మంగళవారం నోటీసులు పంపింది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పేరిట ఆ నోటీసులు జారీ చేసింది. 

ఇతర కుంభకోణాలపైనా..
నెల క్రితం పోస్టులో పంపిన నోటీసులపై స్పందించని టీడీపీ.. ప్రస్తుతం ప్రత్యక్షంగా పంపిన నోటీసులపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం స్కిల్‌ స్కామ్‌కు సంబంధించిన రూ.27 కోట్ల వివరాలే కాకుండా మొత్తం బ్యాంకు లావాదేవీల వివరాలు సీఐడీకి వెల్లడించాల్సిన అనివార్యత ఏర్పడింది. తద్వారా టీడీపీ అక్రమ నిధుల తరలింపు నెట్‌ వర్క్‌ గుట్టురట్టు కానుంది.

ఫైబర్‌నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్, అసైన్డ్‌ భూములు, మద్యం, ఇసుక కుంభకోణాల ద్వారా కొల్లగొట్టిన ప్రజాధనంలో టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఎంతమేర తరలించారో నిగ్గు తేల్చే అవకాశాలున్నాయి. దీంతో ఈ  కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

మరిన్ని వార్తలు