తలైవాకు అడ్డంకులు

21 May, 2017 02:50 IST|Sakshi
తలైవాకు అడ్డంకులు

రజనీ రాజకీయ ప్రవేశానికి బ్రేకులు
సూపర్‌స్టార్‌ వ్యాఖ్యలపై విమర్శలు

విమర్శలతో మనస్తాపం చెందినట్లు ప్రకటించిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌పై తమిళ భాషాభిమానులు మరోసారి విరుచుకుపడ్డారు. తమిళనాడును తమిళుడే పాలించాలని వ్యాఖ్యానించి రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశ ఆలోచనలకు బ్రేక్‌ వేసే ప్రయత్నం చేశారు. రజనీకాంత్‌కు వ్యతిరేకంగా శనివారం తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాజకీయాల్లో రాణించాలంటే అభిమానులను ఆకర్షించే శక్తి మాత్రమే సరిపోదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత  రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొని ఉండగా, ఏళ్ల తరబడి చర్చల్లో ఉన్న రజనీకాంత్‌ రాజకీయ అరంగేట్రం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్‌ రాజకీయాలపై చూచాయగా మాట్లాడారు. తాను తమిళుడిని కాను అంటూ కొందరు చేసిన విమర్శలకు రజనీకాంత్‌ సుదీర్ఘ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు కృష్ణగిరి జిల్లా వారని అభిమానుల సమావేశంలో చెప్పారు. 67 ఏళ్ల తన జీవితంలో 23 ఏళ్లు మాత్రమే కర్ణాటకలో ఉన్నాను, 44 ఏళ్లుగా చెన్నైలో ఉంటున్నానని కూడా వివరించారు.

 అయితే రాష్ట్రంలోని భాషాభిమానులు మాత్రం రజనీ వివరణను అంగీకరించలేదు. పైగా తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రాష్ట్రంలో ఎందరో గొప్ప నేతలు ఉన్నా ప్రజాస్వామ్యం మాత్రం దెబ్బతినిపోయిందని రజనీ చేసిన విమర్శలపై స్టాలిన్‌ మినహా ఎవ్వరూ సానుకూలంగా స్పందించలేదు. రజనీ రాజకీయాల్లోకి రావడంపై ఆది నుంచి అభ్యంతరం చెబుతున్న భాషాభిమాని నామ్‌ తమిళర్‌ కట్టి అధినేత సీమాన్‌ మాట్లాడుతూ రజనీ రాజకీయాల్లోకి వచ్చి చేయాల్సింది ఏమీ లేదు, తామే అన్నీ చూసుకుంటామని విమర్శించారు. దళపతిగా మాకు అండగా నిలవండి, సీఎం కావాలని ఆశించకండి అని అన్నారు. మీలాగ మాకు నటించడం తెలీదు, మాలాగ మీకు పోరాడడం రాదు అని చెప్పారు. తమిళనాడులో జీవించే హక్కు అందరికీ ఉంది, పాలించే హక్కు తమిళుడికి మాత్రమే ఉందని సీమాన్‌ వ్యాఖ్యానించారు.

తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్‌మురుగన్‌ మాట్లాడుతూ తమిళనాడులో సిస్టమ్‌ (వ్యవస్థ) సరిగా లేదని విమర్శించిన రజనీ...సరిలేని వ్యవస్థ ద్వారా సంపాదించిన వేలకోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తారా అని నిలదీశారు. తమిళనాడులో ఒకమాట, కర్ణాటకలో ఒక మాట చెప్పి డబ్బు సంపాదించే రజనీకాంత్‌ వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన దుయ్యబట్టారు. ఏడుకోట్ల తమిళుల్లో ఒకరు మాత్రమే రాష్ట్రాన్ని పాలించాలని ఆయన అన్నారు.

సమత్తువ మక్కలళ్‌ కళగ అధ్యక్షుడు ఎర్నావూర్‌ నారాయణన్‌ మాట్లాడుతూ, తందై పెరియార్‌ చేత పక్కాతమిళుడు అనే కీర్తిని ఆర్జించిన కామరాజనాడార్‌ స్థానంలో రజనీకాంత్‌ ఆ పేరును సొంతం చేసుకోవడం గర్హనీయమన్నారు. ఇది కామరాజనాడార్‌ను అవమానించడమేనని పేర్కొన్నారు.

సినీ దర్శకులు గౌతమన్‌ మాట్లాడుతూ, యుద్ధానికి సన్నద్ధం కండి అని తమిళులకు పిలుపునిచ్చిన రజనీకాంత్‌...ఇదే తమిళుల సమస్యల పరిష్కారం కోసం పోరుసమయంలో ఎందుకు మౌనం పాటించారు, శ్రీలంక ప్రభుత్వం ఈలం తమిళులను చంపి శవాలను గుట్టలుగుట్టలుగా పోసినపుడు తమరు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తమిళనాడును తమిళుడే పాలించాలి, అలా కాదని ఎవరైనా ముందుకు వస్తే వ్యతిరేక యుద్ధం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవస్థ చెడిపోయిందని అభిమానుల ముందు రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని గాయాన్ని తేటతెల్లం చేశాయని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌.రాజా అన్నారు.

సీఎం ఎడపాడి నేతృత్వంలో వ్యవస్థ సరిగా ఉందని లోక్‌సభ ఉప సభాపతి తంబిదురై అన్నారు. రజనీ రాజకీయ విమర్శలను స్వాగతిస్తున్నా, బీజేపీలోకి వస్తే సంతోషిస్తానని కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు, అయితే వారి ఎదుగుదల ప్రజల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ శివగంగైలో మీడియాతో అన్నారు. రుగ్మతతో బాధపడుతున్న వ్యవస్థ కుదుటపడాలంటే యాక్టర్‌ కాదు డాక్టర్‌ అవసరమని పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్‌ అన్బుమణి రాందాస్‌ వ్యాఖ్యానించారు.

రజనీ రాజకీయ ప్రవేశంపై విరక్తి: నటి కస్తూరి
రాజకీయాల్లోకి రావడమా, మానడమా అనే విషయంలో ఏళ్లతరబడి రజనీకాంత్‌ నాన్చుడు ధోరణి విరక్తి కలిగిస్తోందని సినిమా నటి కస్టూరీ శనివారం తన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా అభిమానులను కలుసుకుంటూ ‘పోర్‌..పోర్‌... రజనీ బోర్‌’ (యుద్ధం...యుద్ధం..అంటూ రజనీ బోర్‌) కొట్టిస్తున్నారని ఆమె అన్నారు. మంచి నేత కోసం తమిళనాడు ఎదురుచూడని తరుణంలో కూడా రాజకీయ ప్రవేశ నిర్ణయం తీసుకోవడానికి «ధైర్యం కావాలని ఆమె చెప్పారు.

 వస్తానో..రానో అంటూ రజనీ ఏళ్లతరబడి ఆలోచిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కస్తూరీ చేసిన విమర్శలపై రజనీ అభిమానులు విరుచుకుబడ్డారు. ‘నీవు కూడా రజనీ గురించి మాట్లాడుతున్నావా... అంతా టైమ్‌..ఎంచేస్తాం...నోరు మూసుకుని పోవే’ అంటూ ఒక అభిమాని ఘాటుగా స్పందించాడు. ఇందుకు కస్తూరీ సైతం ఘాటుగా బదులిస్తూ ‘ నీవు పుట్టక ముందు నుంచి నేను రజనీ అభిమానిని, నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల రజనీకి చెడ్డపేరు, అవమానం..ముందు నీ నోరు మూసుకో’ అని ప్రతిస్పందించారు.

 ‘రజనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు, సినిమారంగంలో ఉండి విమర్శిస్తున్నావు... ఎంత అమర్యాద’ అని మరో అభిమాని కామెంట్‌ చేశాడు. ఈ కామెంట్‌కు కస్తూరీ బదులిస్తూ ‘ నేను రజనీకాంత్‌కు వీరాభిమానిని, నేను చేసేది విమర్శలు కాదు, విరక్తితో అంటున్న మాటలు, ఇదే విరక్తి అందరి మనస్సులోనూ ఉంది, అదే నేనూ చెబుతున్నాను’ అని ఆమె ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు