కుష్భు వైపు చూపు..

22 Jun, 2015 08:27 IST|Sakshi
కుష్భు వైపు చూపు..

 సాక్షి, చెన్నై : తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల కోసం పెద్ద సమరమే సాగుతున్నది. మహిళా నాయకులు పలువురు ఆ పదవిని చేజిక్కించుకునేందుకు తీవ్రంగానే కుస్తీలు పడుతున్నా, సినీ గ్లామర్ కుష్భు వైపు ఏఐసీసీ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అయితే, ఈ గ్రూపు రాజకీయాల నడుమ ఆ పదవి ముళ్ల కిరీటంగా మారుతుందేమోనన్న బెంగ కుష్భులో బయలు దేరినట్టు సమాచారం.రాష్ట్రంలోని పలు పార్టీల్లో మహిళా విభాగాలు మెరుగ్గానే ఉన్నాయి.

 

అన్నాడీఎంకేలో సర్వం జయలలిత కాబట్టి ఆమె మాట అందరికీ శిరోధార్యం. ఇక, డీఎంకేలో మహిళా విభాగాన్ని గాడిలో పెట్టే బాధ్యతల్ని కరుణానిధి గారాల పట్టి కనిమొళి తన భుజాన వేసుకుని ఉన్నారు. డీఎండీకే మహిళా విభాగంలో తెర వెనుక నుంచి ఆ పార్టీ అధినేత  విజయకాంత్ సతీమణి ప్రేమలత అ న్ని వ్యవహారాలు  సాగిస్తున్నారు. మిగిలిన పా ర్టీల్లోనూ మహిళా విభాగాలు చురుగ్గా ఉన్నా, కాంగ్రెస్‌లో మాత్రం చతికిల బడి ఉన్నది.
 
 ఆది నుంచి రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం కరువు. ఇందుకు కారణం పార్టీలోని గ్రూపులు అక్కడికి కూడా పాకడమే. ప్రస్తుతం ఆవిభాగం అధ్యక్షురాలుగా సాయిలక్ష్మి వ్యవహరిస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు రాష్ట్రంలో  మహిళా శక్తిని తమ వైపు కు తిప్పుకునే రీతిలో ఆ విభాగాన్ని పటిష్టవం తం చేయడానికి ఏఐసీసీ నిర్ణయించి ఉన్నది. మహిళా సమరం : మహిళా విభాగం అధ్యక్ష పగ్గాలు మారనున్న సమాచారంతో రంగంలోకి మహిళా నేతలు దిగారు.

 

మాజీ ఎమ్మెల్యేగా , పార్టీలో సీనియర్‌గా ఉన్న యశోధ, మాజీ ఎంపి అన్భరసు కుమార్తె సుమతి, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మద్దతు దారు హసీనా సయ్యద్, మరో నేత వారసురాలు రాణి వెంకటేషన్‌లతో పాటుగా పలువురు ఆ పదవి కోసం రంగంలోకి దిగారు. దీంతో మహిళా సమరం రాజుకున్నట్టు అయింది. ఎవరికి వారు తమ ప్రయత్నాల్ని వేగవంతం చేసి ఉండటంతో మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజాకు శిరోభారం తప్పలేదు. అలాగే, తమ వాళ్లకు పదవులు దక్కేలా చేయడానికి ఆయా మహిళ నేతల మద్దతు నేతలు ఏఐసీసీలో పావులు కదిపే పనిలో పడటం ఆ పదవికి గట్టి పోటీని కల్పించి ఉన్నది.
 
 కుష్భు వైపు చూపు :  ఆ పదవి కోసం పలువురు పోటీలు పడుతున్నా, ఏఐసీసీ మాత్రం కుష్భు వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.  ఇటీవల కాలంగా రాష్ట్ర పార్టీలో సీనీ గ్లామర్  కుష్భు  కీలక నాయకురాలుగా  అవతరిస్తున్నారు.  ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకున్నా,  ఆమె సభలకు, ప్రసంగాలకు అనూహ్య స్పందన వస్తున్న విషయం ఏఐసీసీ దృష్టికి చేరి ఉన్నది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఆ పదవిని ఆమెకు కట్ట బెట్టాలన్న నిర్ణయంతో ఏఐసీసీ ఉన్నట్టు సంకేతాలు వెలువుడుతున్నాయి. ఇందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

 

అయితే, ఇప్పటికే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కుష్భు కు జోడు పదవులు అప్పగించడం వివాదానికి దారి తీసే అవకాశాలు ఎక్కువే. కొత్తగా వచ్చిన ఆమెను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు పార్టీలో బయలు దేరడం ఖాయం. దీంతో పోటీలో ఉన్న వాళ్లను బుజ్జగించి కుష్భుకు మార్గం సుగమం చేయడానికి ఏఐసీసీ కసరత్తుల్లో నిమగ్నమైనట్టు సమాచారం.
 
 ఇందులో భాగంగా  మహిళ విభాగం నాయకులతో చర్చించి, వారి అభిప్రాయాల మేరకు తుది నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడానికి మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు శోభా ఓజా రంగంలోకి  దిగనున్నారు. ఈనెల 29న ఆమె సత్యమూర్తి భవన్‌లో మహిళా నేతలతో భేటికి నిర్ణయించి ఉన్నారు. కుష్భు పేరును అధిష్టానం ప్రతిపాదించిన పక్షంలో  పోటీలో ఉన్న యశోధ, హసీనా సయ్యద్, రాణి వెంకటేషన్ వంటి వారు వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

 

ఇక,  టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ ఆశీస్సులు కల్గిన సుమతి ఏ నిర్ణయం తీసుకుంటారోనన్నది వేచి చూడాల్సిందే. అయితే, అధిష్టానం నిర్ణయానికే మెజారిటీ శాతం మంది కట్టుబడుతారని, కుష్భును రంగంలోకి దించాల్సిందేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ గ్రూపు రాజకీయాల మధ్య ఆ పదవిని దక్కించుకుని, రాణించ గలనా..? అన్న డైలమాలో కుష్భు ఉన్నట్టు సమాచారం. ఈ విషయంగా ఆమెను ప్రశ్నించగా, అధ్యక్ష పదవి ఎంపిక సమాచారం తన వద్ద కూడా ఉందని, అయితే, అధిష్టానం నిర్ణయం మేరకు తన అభిప్రాయం వ్యక్తం చేస్తానన్నారు.

మరిన్ని వార్తలు