త్రుటిలో తప్పిన ప్రమాదం

8 Apr, 2017 01:39 IST|Sakshi
త్రుటిలో తప్పిన ప్రమాదం

ఢిల్లీ విమానాశ్రయంలో ఢీకొనబోయిన ఎయిరిండియా, ఇండిగో విమానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రెండు విమానాలకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం (ఏఐ156), రాంచీ నుంచి ఢిల్లీ వచ్చిన ఇండిగో (6ఈ389) విమానాలు దాదాపు ఢీకొనబోయాయి. ఏటీసీ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) సిబ్బంది అప్రమత్తంగా ఉండటంతోపాటు పైలట్లు నైపుణ్యాన్ని ప్రదర్శించి భారీ ప్రమాదాన్ని నివారించగలిగారు.

ఢిల్లీ విమానాశ్రయంలోని రన్ –27, రన్ వే–28లు ఒక చివరన కలిసిపోయి ఉంటాయి. రన్ వే–27పై ఇండిగో విమానం దిగాల్సి ఉండగా, రన్ వే–28 నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్‌ తీసుకోవా ల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం ఎయిరిండియా విమానం రన్ వే 28 నుంచి మొదలై, రెండు రన్ వేలు కలిసేచోట టేకాఫ్‌ తీసుకోవాలి. అలాగే ఇండిగో విమానం రన్ వే–27పై దిగాలి. కానీ ఇండిగో రన్ వే పైకి వచ్చాక ల్యాండిగ్‌కు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మళ్లీ టేకాఫ్‌కు వెళ్లింది. అప్పటికే ఎయిరిండియా విమానం కూడా గంటకు 185 కి.మీ వేగంతో టేకాఫ్‌ తీసుకోడానికి వెళ్తోంది.

రెండు రన్ వేలు అవతలి చివరన కలిసి ఉన్నందున, రెండు విమానాలు టేకాఫ్‌ తీసుకొని ఉంటే గాలిలోనే ఢీకొనేవి. అయితే అప్రమత్తమైన ఏటీసీ సిబ్బంది, ఎయిరిండియా విమానాన్ని నిలిచిపోవాల్సిందిగా ఆదేశించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇండిగో విమానం ఎందుకు ల్యాండ్‌ కాకుండా మళ్లీ టేకాఫ్‌ తీసుకోవాల్సి వచ్చిందో విచారణలో తేలుతుందని అధికారులు పేర్కొన్నారు. వేగంలోనూ విమానాన్ని సురక్షితంగా నిలిపి వేసిన పైలట్‌ మళ్లీ వెనక్కు తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు