గుండెపోటుతో ఎయిర్‌ ఇండియా పైలట్‌ మృతి.. 100 రోజుల్లో మూడో ఘటన

16 Nov, 2023 20:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఈ మద్య కాలంలో చాలా మంది గుండెపోటుతో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్‌ హార్ట్‌ఎటాక్‌తో మృత్యుతపడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఓ యువ పైలట్‌ గుండెపోటుతో ప్రాణాలు విడిచిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. 

ఎయిర్‌ ఇండియాకు చెందిన 37 ఏళ్ల పైలట్‌ హిమ్మనీల్ కుమార్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లోని ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పితో కుప్పకూలిపోయాడు. గమనించిన సహోద్యోగులు సీపీఆర్‌ చేశారు. అనంతరం ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పైలట్‌ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

కాగా, సీనియర్‌ కమాండర్‌ పైలట్‌ అయిన హిమ్మనీల్ కుమార్, పెద్దవైన బోయింగ్ 777 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఆపరేట్ చేసేందుకు అక్టోబర్ 3 నుంచి శిక్షణ పొందుతున్నట్లు ఎయిర్‌ ఇండియా అధికారి తెలిపారు. ఆగస్టు 23న జరిగిన వైద్య పరీక్షల్లో ఆరోగ్యపరంగా ఫిట్‌గా ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే ఊహించని విధంగా ఆయన మరణించడంపై ఎయిర్‌ ఇండియా సంస్థ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా యువ పైలట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. గత మూడు నెలలో ముగ్గురు పైలట్‌లు మృతువాతపడ్డారు. గత ఆగస్టులో ఇండిగో ఎయిర్‌లైన్‌కి చెందిన పైలట్ పూణేకు విమానం టేకాఫ్‌ అయ్యే ముందు నాగ్‌పూర్ ఎయిర్‌పోర్ట్ బోర్డింగ్ గేట్ వద్ద కుప్పకూలిపోయాడు. అతడికి ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించినా ప్రాణాపాయం నుంచి బయటపడలేకపోయారు. ఈ సంఘటనకు ఒక రోజు ముందు, ఖతార్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్న స్పైస్‌జెట్ కెప్టెన్ ఢిల్లీ నుంచి దోహాకు వెళ్తుండగా విమానంలోనే మరణించాడు.
చదవండి: సిద్దరామయ్య కుమారుడిపై మాజీ సీఎం సంచలన ఆరోపణలు..

మరిన్ని వార్తలు