అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వైద్య కళాశాలలు

3 Aug, 2014 03:50 IST|Sakshi
  •    ఉత్తమ వసతులు, నాణ్యమైన విద్యకు పెద్దపీట
  •    ముఖ్యమంత్రి సిద్దరామయ్య
  • కోలారు : పేద పిల్లలు సైతం వైద్య విద్యను అభ్యసించేలా రాష్ర్టంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వైద్య కళాశాలల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఇప్పటికే 12 కొత్త మెడికల్ కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.  

    నగర సమీపంలోని  దేవరాజ్ అరస్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక నూతన ఆడిటోరియం భవనాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించి అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పిల్లలను డాక్టర్లు చేయాలని తల్లిదండ్రులు ఆసక్తి చూపుతుండటంతో రాష్ర్టంలో వైద్య విద్యకు డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉత్తమ వసతులు కల్పించి నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.
     
    ప్రభుత్వ వైద్య కళాశాలల్లో తక్కువ ఫీజులతో వైద్య విద్యను అభ్యసించిన వారు ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించడానికి ఇష్టపడడం లేదని విచారం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించినవారే నిజమైన సమాజ సేవా దృక్ఫథం కలిగిన వైద్యులుగా చెప్పవచ్చునన్నారు. 25 సంవత్సరాల క్రితం మెడికల్ కళాశాలను ప్రారంభించిన జాలప్ప అంచెలంచెలుగా అభివృద్ధి చేశారని కొనియాడారు.

    దేవరాజ్ అరస్ మెడికల్ కళాశాల దేశంలోనే ఉత్తమ కళాశాలగా ఉనికిని చాటుకుంటోందన్నారు. తక్కువ ఫీజుతో నిరుపేద రోగులకు వైద్య సేవలు అందిస్తున్న జాలప్ప సహృదయం మెచ్చదగిందన్నారు. రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి ఎస్‌ఆర్ పాటిల్ మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అందునా కర్ణాటకలో వైద్య కళాశాలలు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు నిర్వహించిన సాంసృ్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

    రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యుటి ఖాదర్,  ఎంపీ కేహెచ్ మునియప్ప, విధాన పరిషత్ సభ్యుడు నజీర్ అహ్మద్, దేవరాజ్ అరస్ మెడికల్ కళాశాల చైర్మన్ ఆర్‌ఎల్ జాలప్ప, విధాన పరిషత్ సభ్యుడు ఉగ్రప్ప, చాన్సలర్ రాజేష్ జగదాళె, వైస్ చాన్సలర్ ఎంబీ సాణికొప్ప, సెక్రెటరీ మెయినుద్దీన్ కుట్టి,  రిజిష్ట్రార్ మోయిద్దీన్ కుట్టి తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు