పట్టాలు తప్పిన ‘అమరావతి’

30 Oct, 2014 22:49 IST|Sakshi
పట్టాలు తప్పిన ‘అమరావతి’

సాక్షి, ముంబై: అమరావతి నుంచి ముంబై వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం ఉదయం 4.50 గంటల ప్రాంతంలో కల్యాణ్ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు వేగం చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులెవరూ గాయపడలేదని రీజినల్ అధికారి అరుణేంద్ర కుమార్ చెప్పారు.

ఈ ఘటన లోకల్‌తోపాటు దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన అన్నారు. కల్యాణ్ స్టేషన్‌లో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారంపై రైలు వస్తుండగా ఇంజిన్, వెనకాలే ఉన్న ఓ బోగీ పట్టాలు తప్పినట్లు కుమార్ చెప్పారు. ఈ ఘటన కారణంగా కొన్ని రైళ్లను దారి మళ్లించగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది ఇంజిన్, బోగీని పట్టాలు ఎక్కించే పనులు ప్రారంభించారు.

ప్రయాణికుల ఇబ్బందులు...
అమరాతి-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం కారణంగా వెనకాలే వస్తున్న పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ముఖ్యంగా సికింద్రాబాద్-ముంబై సీఎస్టీ మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఠాణే స్టేషన్‌కు ఉదయం అరున్నరకు రావాల్సిన దేవగిరి ఎక్స్‌ప్రెస్ 10 గంటల తర్వాత చేరుకుందని ప్రయాణికులు కొల్లూరి మహేశ్, ఉషారాణి న్యూస్‌లైన్‌కు చెప్పారు. ఇదిలాఉండగా, మన్మాడ్-ముంబై-మన్మాడ్ పంచవటి ఎక్స్‌ప్రెస్, మన్మాడ్-కుర్టా టర్మినస్-మన్మాడ్ గోదావరి ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయగా, భుసావల్-పుణే ఎక్స్‌ప్రెస్‌ను మన్మాడ్-దౌండ్ మీదుగా దారి మళ్లించారు.
 
లోకల్ రైళ్లపై ప్రభావం
రైలు పట్టాలు తప్పడంతో నాలుగో నంబర్ ప్లాట్‌ఫారం నిరుపయోగంగా మారింది. దీంతో మిగతా ప్లాట్‌ఫారాలపై అదనపు భారం పడింది. దీని ప్రభావం లోకల్ రైళ్లపై కూడా పడింది. పలు లోకల్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి. దీనివల్ల ఉదయం ఆసన్‌గావ్, టిట్వాల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, ఇతరులు తమ గమ్యస్థానాలకు ఆలస్యంగా చేరుకున్నారు.

మరిన్ని వార్తలు