ఆప్ నేతలకు దూరంగా అన్నా!

13 Dec, 2013 00:27 IST|Sakshi
ఆప్ నేతలకు దూరంగా అన్నా!

సాక్షి, ముంబై: లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హాజరేను ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు కుమార్ విశ్వాస్, మరో ఇద్దరు సభ్యుల బృందం కలిసింది. అయితే వారిని వేదికిపై అనుమంతించేందుకు హజారే ఇష్టం చూపలేదు. దీంతో వారు కింద కూర్చుండి అన్నా ఆందోళనకు మద్దతు పలికారు.   నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేథా పాట్కర్ కూడా హాజారేను కలిసి, ఆయన దీక్షకు మద్దతు పలికారు. వేదికపెకైక్కి అన్నాతో మాట్లాడిన అనంతరం పాట్కర్  వెళ్లిపోయారు.
 
 అన్నా మద్దతుదారుల నిరసన..
 ఆప్ సభ్యులకు గురువారం మరో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న దీక్షకు మద్దతు పలికేందుకు ఆప్ బృందం సభ్యులు రాలేగావ్ సిద్ధీకి చేరుకోడంతో వారిని చూసేందుకు ముందుకు వచ్చిన హజారే మద్దతుదారుల్లో ఓ వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ ముర్దాబాద్’ అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. అతనికి మరికొంతమంది తోడవడంతో కొంత కలకలం చెలరేగింది. ఆప్ సభ్యులను అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారని తెలిసింది.  ఈ విషయమై అన్నా సన్నిహితులు మాట్లాడుతూ... అన్నా హాజరేతో భేటీ అయ్యేందుకు వస్తానని ప్రకటించి, మూడురోజులైనా ఆప్ నేత కేజ్రీవాల్ రాలేగాం సిద్ధి రాకపోవడంతోనే అన్నా మద్దతుదారుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైందని వివరించారు.  కొంతమంది నినాదాలతో తమ నిరసనను తెలపగా అన్నా బృందం సభ్యులు వారికి సర్దిచెప్పడంతో  శాంతించారని వివరించారు. అనంతరం అన్నా బృందం ఆప్ సభ్యులకు స్వాగతం పలికిందన్నారు.
 
 క్షీణిస్తున్న అన్నా ఆరోగ్యం..
 చలితోపాటు వయసుపైబడిన కారణంగా దీక్ష చేస్తున్న అన్నా ఆరోగ్యం కొంత క్షిణించినట్టు తెలిసింది. ఆయన బరువు తగ్గారని అన్నా బృందం సభ్యులు తెలిపారు. ఇదిలాఉండగా జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టేంత వరకు తన ఆందోళన కొనసాగుతుందని హజారే మరోసారి  స్పష్టం చేశారు. ఆయనకు మద్దతిచ్చేందుకు గురువారం ఉదయం ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ గురువారం రాలేగావ్ సిద్ధీకి చేరుకున్నారు. కొంతసేపు హజారేతో మాట్లాడిన ఆమె అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
 
 పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ..
 జన్‌లోక్‌పాల్ బిల్లుకోసం దీక్ష చేస్తున్న అన్నా హజారే మద్దతుదారులు గురువారం ఉదయం కూడా ప్రభాత్‌ఫేరీ నిర్వహించారు. అనంతరం పార్నేర్ తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
 
 సంతోష్ భారతిపై విశ్వాస్ విమర్శలు...
 లోక్‌పాల్ బిల్లు కోసం అన్నా హజారే చేస్తున్న ఆందోళనలకు సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం చూసుకుంటున్న సంతోష్ భారతిపై ఆప్ సభ్యుడు కుమార్ విశ్వాస్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అన్నా బృందంలో కొందరు విలేకరుల రూపంలో దళారులుగా చేరారని, వారు ఇన్ఫార్మర్లంటూ సంతోషపై పరోక్ష విమర్శలు చేశారు.
 
 రాజకీయ పార్టీ నాయకులకు వేదికపై చోటులేదు...
 రాజకీయ పార్టీల నాయకులకు వేదికపై చోటు లేదని అన్నా హజారే పేర్కొన్నారు. అన్నాను కలిసేందుకు వచ్చిన ఆప్ సభ్యులను కూడా ప్రజలు కూర్చుండే చోటే కూర్చోబెట్టారు. కొంత సేపటి తర్వాత కుమార్ విశ్వాస్‌కు అన్నాహజారేతో ఏకాంతంగా మాట్లాడేందుకు మాత్రం అవకాశమివ్వడం గమనార్హం.
 

మరిన్ని వార్తలు