లిక్కర్‌ కేసులో ఈడీ నోటీసులు.. పార్టీ ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ సమావేశం

6 Nov, 2023 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌  సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గతవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందూ. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ ఆప్‌ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

లిక్కర్‌ కేసులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై వివరాలు రాబట్టేందుకు ఆప్‌ కన్వీనర్ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్టోబర్‌ 30న నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 2న విచారణకు హాజరు కావాలని కోరగా.. ఆయన గైర్హాజరయ్యారు. ఈడీ ఆఫీస్‌కు రాకుండా పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌  పాల్గొన్నారు.

ఈ మేరకు ఈడీ నోటీసులపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. తనకు పంపిన ఈ సమన్లు పూర్తిగా చట్టవిరుద్దమని ఆరోపించారు. కక్షపూరితం, రాజకీయ ప్రేరేపితమని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న తీవ్ర ఒత్తిళ్లతో ఈడీ నోటీసులు పంపించిందని విమర్శించారు. నోటీసులను ఈవీ వెనక్కి తీసుకోవాలని అన్నారు. మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నన్ను అడ్డుకునేందుకు ఇప్పుడీ సమన్లు పంపిందని దుయ్యబట్టారు. 

ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, ఆప్ రాజ్య‌స‌భ ఎంపీ సంజ‌య్ సింగ్‌ల‌ను ఇప్ప‌టికే ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఢిల్లీ లిక్క‌ర్ పాల‌సీకి సంబంధించిన అవినీతి కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ దాదాపు 9 గంట‌ల పాటు ప్ర‌శ్నించింది. వ‌చ్చే ఏడాది జ‌రిగే లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు విపక్ష ‘ఇండియా కూట‌మి’ నాయకులను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఈ క్రమంలోనే ముందుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆప్‌ నేత‌లు ఇటీవ‌ల కాషాయ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు.
చదవండి: ప్ర‌మాద‌స్థాయిలో వాయు కాలుష్యం.. ఢిల్లీలో మళ్లీ స‌రి-బేసి విధానం

మరిన్ని వార్తలు