'దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోంది'

22 Oct, 2016 19:12 IST|Sakshi
'దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోంది'
విశాఖపట్టణం : రాష్ట్రంలో దేవాదాయశాఖ గుడ్డిగా నడుస్తోందని ఆ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా పరిషత్ సమావేశం హాల్లో శనివారం నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల దేవాదాయ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ శాఖలో పనిచేస్తున్న వారిలో బాధ్యతారాహిత్యం కనిపిస్తోందని మండిపడ్డారు. 
 
ఇక నుంచి సీరియస్‌గా పనిచేయకపోతే ఉద్యోగాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలని మాణిక్యాలరావు హెచ్చరించారు. ఉప కమిషనర్, సహాయ కమిషనర్ కార్యాలయాల్లో తప్పనిసరిగా కంప్యూటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉండాలని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలని ఆదేశించారు. దేవాదాయశాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఇక నుంచి ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారానే జరగాలని సూచించారు. ఆన్‌లైన్ సిస్టమ్‌పై సిబ్బందికి వర్క్‌షాప్ నిర్వహించి అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. 
 
ఏ ఆలయంలో ఎంత మంది దర్శనం చేసుకుంటున్నారు. ఆదాయం ఎంత వస్తోంది.. తదితర అంశాలను ఏ రోజుకారోజు మెయిల్ ద్వారా పంపాలని ఆదేశించారు. పెద్ద ఆలయాల ద్వారా విద్యాదాన కార్యక్రమాలు నిర్వహించాలని, ఆలయ సేవ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, దేవుడి దర్శనానికి వచ్చే వికలాంగులు, వృద్ధుల కోసం వీల్‌చైర్లు, ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. 
 
భక్తులను విసుక్కోకుండా గౌరవించి పంపాలని, భక్తులపై కేకలు వేస్తే సహించేది లేదన్నారు. దేవాలయాల ఆస్తులు కోర్టు పరిధిలో ఉంటే ప్రభుత్వం వైపు వచ్చేలా కృషి చేయాలని చెప్పారు. కార్యనిర్వహణాధికారుల పనితీరు, గతంలో వారు పనిచేసిన ఆలయాల్లో ఆదాయం ఎంత వచ్చేది? ప్రస్తుతం ఎంత వస్తోంది? తదితర అంశాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి మెయిల్ చేయాలని, దేవాలయాల ఆదాయం పెంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనురాధ, ఆర్జేడీ చంద్రశేఖర్ ఆజాద్, డిప్యూటీ కమిషనర్ మూర్తి, ఉత్తరాంధ్ర జిల్లాల ఆలయాల కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు