అందివచ్చిన అవకాశం

21 May, 2014 22:43 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ నేత గడ్కరీ తనపై వేసిన పరువునష్టం కేసులో తాజా పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారా? ఈ ప్రశ్నకు రాజకీయ విశ్లేషకులు మాత్రం అవుననే సమాధానమిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో పోటీ చేసి కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే గెలుపొందిన గడ్డు పరిస్థితుల్లో పార్టీ ఉంది. ప్రచార బాధ్యతను పూర్తిగా తన భుజాన ఎత్తుకొన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఓటమికి కూడా తానే బాధ్యత వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవేళ అలా బాధ్యత వహిస్తూ పార్టీ కన్వీనర్ పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఇక ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్ర ముగిసిన అధ్యాయమే అవుతుంది. అలాకాకుండా తానే కొనసాగుతూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ముం దు ఉన్నంతగా ప్రజాదరణ ఇప్పుడు కేజ్రీవాల్‌కు లేదు. పైగా దేశవ్యాప్తంగా మోడీ చరిష్మాతో బీజేపీ హవా కొనసాగుతుంది. మోడీ గాలి లేనప్పుడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి గతంలో కంటే ఎక్కువ స్థానాలే దక్కే అవకాశముంది. దీంతో ఈ పరిస్థితి గట్టెక్కాలంటే కేజ్రీవాల్ మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాల్సిన అవసరం ఎంతో ఉంది.
 
 నెపం బీజేపీపైకి నెట్టేందుకే...
 కేజ్రీవాల్ జైలుకు వెళ్లడానికి కారణం గడ్కరీ కేసు వేయడమేననే విషయం అందరికీ తెలిసిందే. అయితే తనను బీజేపీ పార్టీ జైలుకు పంపిందనే ప్రచారం చేసి, తనకు తాను హీరో కావడంతోపాటు ప్రత్యర్థి బీజేపీని కేజ్రీవాల్ ఇరుకున పెట్టే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జైలుకు వెళ్లడం ద్వారా కేజ్రీవాల్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలుస్తారని, అసెంబ్లీ ఎన్నికలు తప్పేలా లేని పరిస్థితిలో ఆయన జైలుకు వెళ్లడం ఆప్‌కు కలిసొచ్చే అంశమేనంటున్నారు. పైగా బెయిల్ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా జైలుకు వెళ్లడానికే సుముఖత వ్యక్తం చేయడాన్ని మీడియా పదే పదే చూపుతుండడం కేజ్రీవాల్‌ను మరోసారి హీరో చేస్తుందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విద్యుత్ కనెక్షన్‌ను నేరుగా పునరుద్ధరించి, జైలుకు వెళ్లే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు. ఆ ఘటనతో తన పేరుప్రఖ్యాతులను పెంచుకున్న కేజ్రీవాల్ ఆ తర్వాత రకరకాల ప్రచార కార్యక్రమాలతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితే సృష్టించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తారనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట.
 
 ప్రత్యర్థుల విమర్శలు ఆప్‌కు వరాలే...
 బెయిల్‌ను తిరస్కరిస్తూ జైలుకు వెళ్లేందుకే సుముఖత వ్యక్తం చేసిన కేజ్రీవాల్‌పై కాంగ్రెస్, బీజేపీలు విరుచుకుపడడం మొదలుపెట్టాయి. ఇది కూడా ఆప్‌కు కలిసివచ్చే అంశమేనంటున్నారు విశ్లేషకులు. పదివేల రూపాయల పూచీకత్తుపై బెయిల్ పొందే అవకాశమున్నా అది తమ పార్టీ  సూత్రాలకు విరుద్ధమని, ఇక్కడ డబ్బు అంశం కాదని, అది చెల్లిస్తే కేజ్రీవాల్ నేరం చేసినట్టేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్‌లు మాత్రం కేజ్రీవాల్ వ్యవహారశైలిని ఓ స్టంట్‌గా కొట్టిపారేస్తున్నారు. బెయిల్ తీసుకోమని, అవసరమైతే ఎప్పుడు కోర్టు ముందు హాజరు కావాలన్నా హాజరయ్యేలా హామీ పత్రం రాసిస్తామని మనీశ్ సిసోడియా చేసిన అభ్యర్థనపై ప్రత్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందని, ఇకనైనా ఆప్ నేత నాటకాలు మానాలని బీజేపీ విమర్శించింది. ఇప్పుడు ఆయనకు జన్‌లోక్‌పాల్ బిల్లు, ప్రజా సమస్యలు ఎవీ కనిపించడంలేదని, కేవలం అధికారంలోకి రావడమే ఆయనముందున్న లక్ష్యంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేత ముకేశ్ శర్మ ఆరోపించారు.
 
 తీహార్ జైలుకు కేజ్రీవాల్
 వ్యక్తిగత పూచీకత్తును సమర్పించేందుకు నిరాకరించిన కేజ్రీవాల్‌ను పటియాలా కోర్టు ఆవరణలోని జైలులో అరగంటసేపు ఉంచిన అనంతరం ఆయనను తీహార్ జైలుకు తరలించారు. సాయంత్రం 6.30 గంటలకు కేజ్రీవాల్ తీహార్ జైలుకు చేరుకున్నారు. వార్డు నంబర్ 14లోని జైలు నంబర్ 4లో కేజ్రీవాల్‌ను ఉంచారు. ఆయనకు ఓ దుప్పటి, బెడ్‌షీట్, ఓ చాప ఇచ్చామని, నేలపైనే పడుకున్నారని తీహార్ అధికారి సునీల్ గుప్తా తెలిపారు.
 
 ఆప్ నేతలను అడ్డుకున్న పోలీసులు...
 కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఇటు పటియాల కోర్టు ఆవరణలో, అటు తీహార్ జైలు వద్ద ఆప్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.  
 

మరిన్ని వార్తలు