అళగిరి రివర్స్ గేర్

17 Sep, 2014 23:47 IST|Sakshi
అళగిరి రివర్స్ గేర్

 పార్టీలోకి మళ్లీ ఆహ్వానించేందుకు ఓ వైపు కసరత్తులు జరుగుతుంటే, మరో వైపు రివర్స్ గేర్ వేస్తూ అధిష్టానంపై అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకేలో మళ్లీ చర్చకు తెర లేపింది. డీఎంకేతో సామరస్యం ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఏ అర్హతలున్నాయని నాయకత్వానికి స్టాలిన్ పాకులాడుతున్నారని విమర్శలు గుప్పించారు. కరుణానిధిని కలిసేప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
 
 సాక్షి, చెన్నై:డీఎంకేలో సాగుతున్న వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలు నేర్పిన గుణపాఠంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు పార్టీలో సమూల మార్పుల లక్ష్యంగా అధినేత కరుణానిధి కుస్తీలు పడుతున్నారు. పార్టీలో సాగుతున్న వివాదాలకు ముగింపు పలికే విధంగా కొరడా ఝుళిపించే పనిలో పడ్డారు. ఇందులో ప్రధాన అంశంగా ఉన్న అళగిరి ఎపిసోడ్‌కు శుభం కార్డు వేయడానికి పావులు కదుపుతున్నారు. బహిష్కరణకు గురైన పెద్దకుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని మళ్లీ పార్టీలోకి రప్పించే విధంగా రాయబారాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా అధిష్టానం ముందు అళగిరి కొన్ని డిమాండ్లు ఉంచారు. అలాగే, సోదరుడు, పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దన్న సూచనను దూతలు అళగిరి ముందు ఉంచారు. అన్నీ సజావుగా సాగుతున్న సమయంలో అళగిరి సంచలన వ్యాఖ్యలు చేయడం డీఎంకే వర్గాల్ని విస్మయంలో పడేశాయి. స్టాలిన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ వ్యాఖ్యల వెనుక తన డిమాండ్లకు డీఎంకే అధిష్టానం దిగి రాలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 ఏ అర్హతలున్నాయ్...: బుధవారం అళగిరి మీడియాతో మాట్లాడారు. మీడియా సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, అటు అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే,  ఇటు స్టాలిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీఎంకేలో కరుణానిధిని తప్ప మరెవ్వరినీ అధి నాయకుడిగా ఏ కార్యకర్త అంగీకరించడని పేర్కొన్నారు. ఏ అర్హతలున్నాయని స్టాలిన్ నాయకత్వం కోసం వెంపర్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. కరుణానిధి నాయకత్వంలో డీఎంకే 2016లో అధికార పగ్గాలు చేపట్టడం ఖాయం అన్న విషయాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త చెబుతూ వస్తున్నారని గుర్తు చేశారు. ఇదే విషయాన్ని మళ్లీ పార్టీ సమావేశంలో స్టాలిన్ గుర్తు చేశారేగానీ, కొత్తగా ఆయన చెప్పిందేమీ లేదని మండిపడ్డారు. ఎలాంటి అర్హతలు లేని స్టాలిన్ నాయకత్వాన్ని పార్టీలో ఏ ఒక్కరూ అంగీకరించే ప్రసక్తే లేదని శివాలెత్తారు.
 
 తాను మాత్రం డీఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో సామరస్యానికి వెళ్లదలచుకోలేదని స్పష్టం చే శారు. తన డిమాండ్లను డీఎంకే అధిష్టానం ముందు ఉంచానని, వాటిని నెరవేర్చాల్సింది వాళ్లే అంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సామరస్యం ప్రసక్తే లేదని, ఎవరొచ్చినా, తన నిర్ణయం ఇదేనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కరుణానిధిని కూడా కలిసేది లేదని స్పష్టం చేశారు. డీఎంకే సంస్థాగత ఎన్నికలన్నీ బోగస్‌గా తేల్చారు. నిజమైన కార్యకర్తలకు పదవులు దక్కలేదని, కొత్తగా వచ్చిన వాళ్లకు, ధన బలం ఉన్న వాళ్లకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కాయని ఆరోపించారు. పార్టీలో నిజమైన సేవకులకు చోటు లేదని, నిజాయితీగా వ్యవహరిస్తే, క్రమ శిక్షణవేటు వేస్తున్నారని మండి పడ్డారు. తన కోసం నిలబడిన వారు ఎందరో డీఎంకే బాధితులుగా మిగిలారని ఆవేదన వ్యక్తం చేశారు. అళగిరి తాజా వ్యాఖ్యలతో డీఎంకేలో మళ్లీ ప్రకంపన బయలు దేరినట్టే. ప్రక్షాళన వేళ మరో శిరోభారం నెత్తికెక్కడంతో అధినేత కరుణానిధి ఎలా వ్యవహరించనున్నారో వేచి చూడాల్సిందే.  
 

మరిన్ని వార్తలు