షార్జాలో బతుకమ్మ వేడుకలు

8 Oct, 2013 00:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దుబాయ్‌లోని ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంఘం (ఈటీసీఏ) ఆధ్వర్యంలో ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించనున్నారు. షార్జా నేషనల్ పార్క్‌లో ఈనెల 14న సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని సంఘం వ్యవస్థాపకుడు పీచర కిరణ్ కుమార్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. బతుకమ్మ దసరా సంబరాల నిమిత్తం ఈటీసీఏ మహిళా విభాగంలోని 20 మంది సభ్యులను నిర్వాహకులుగా నియమించారు. ఈ సమావేశంలో బతుకమ్మ సంబరాల పోస్టర్‌ను మహిళా సభ్యులు విడుదల చేశారు. బాలికలకు వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి అక్కడి తెలుగు ప్రముఖులు హాజరు కానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో ఈటీసీఏ మహిళా  సభ్యులు ప్రీతి, సౌజన్య, రిశిత, సారిక, స్వాతి, పద్మ, మాధవి, లత, సుమలత, లక్ష్మి, ప్రియాంక, ప్రితీ, సుజాత తదితరులు పాల్గొన్నారు.
 
 నిరంతరం యాంత్రిక జీవనం గడిపే మనకు ఈ పండుగ మన గ్రామీణ సాంస్కృతిక సౌందర్యాన్ని, చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెప్పిస్తుంది. రంగురంగుల పువ్వులు, వాటి గుబాళింపుల మధ్య అంతా ఒకే చోట చేరి బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఉల్లాసాన్ని పంచుతుంది. మనుషుల మధ్య అనుబంధం పెంపొందించగల శక్తి బతుకమ్మకు ఉంది.
 - ప్రీతి
 
 ఈ సంబరాలను నిర్వహించడం వల్ల భావితరాలకు మన ప్రాంత ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుస్తుంది. మన మధ్య దూరం తగ్గి అనుబంధం పెరుగుతుంది.
     - ఆక్కెనపెల్లి రిశిత
 
 తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ కుల, మత, పేద, ధనిక తారతమ్యాలు లేకుండా గల్ఫ్‌లోని తెలుగువారంతా ఒక్కచోటి చేరి పండుగ చేసుకోవడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి పండుగలు జరుపుకోవడం వల్ల సొంత ఊరిలో ఉన్న అనుభూతి కలుగుతుంది.
 -కొండ సౌజన్య

మరిన్ని వార్తలు