నేడే బీజేపీ జాబితా విడుదల ఆశావహుల్లో ఉత్కంఠ

12 Mar, 2014 22:14 IST|Sakshi
 సాక్షి, న్యూఢిల్లీ:నరేంద్ర మోడీ ప్రభ ంజనంతో ఢిల్లీలో అత్యధిక లోక్‌సభ స్థానాలు తమకే దక్కుతాయని, పోటీచేస్తే గెలుపు ఖాయమని నమ్ముతున్న పలువురు బీజేపీ ఢిల్లీ నేత లు పార్టీ టికెట్ కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బీజేపీ గురువారం విడుదల చేయనుండడంతో తమకు అవకాశం దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ వారిలో ఎక్కువయింది. ఢిల్లీలోని ఏడు సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు జనాదరణ ఎక్కువ కావడం. అందుకే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. మరోకారణం పార్టీలో అంతర్గత కలహాలని కార్యకర్తలు అంటున్నారు. 
 
 విజయ్‌గోయల్ వర్గం, హర్షవర్ధన్ వర్గాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. దీంతో ఈ ఇరువురు నేతలు తమ మద్దతుదారులకు టికెట్ ఇప్పించుకోవడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.గోయల్‌ను రాజ్యసభ సభ్యునికిగా చేసినప్పటికీ, ఆయన ఢిల్లీ  బీజేపీ వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటూనే ఉన్నారు. విధానసభ ఎన్నికల్లో ఆప్ నుంచి ఎదురైన గట్టి పోటీ దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ బలాబలాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఖరారు చేయాలని బీజేపీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ ప్రభావం బలంగా ఉండడం వల్ల ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పలువురు బీజేపీ స్థానిక నాయకులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీ సూచిస్తున్నప్పటికీ, పలువురు ఎమ్మెల్యేలు తమ వంతు ప్రయత్నాలు చేశారు.
 
 చాందినీచౌక్ గుప్తాకేనా ?
 చాందినీచౌక్ టికెట్ కోసం విజేంద్ర గుప్తా, నళిన్ కోహ్లీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. టికెట్ గుప్తాను వరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుప్తాకు అరుణ్ జైట్లీ మద్దతు ఉందని వారు అంటున్నారు. రిటైర్డ్ పోలీసు అధికారిణి కిరణ్ బేడీకి ఇక్కడి నుంచి అవకాశం ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోన్నప్పటికీ ఆమె పోటీకి సుముఖంగా లేరని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు మంగత్‌రామ్ సింఘాల్, నంద్ కిశోర్‌గార్గ్ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. ఇక తూర్పుఢిల్లీ స్థానానికి లాల్‌బిహారీ తివారీ, మహేష్ గిరిలో ఒకరిని ఖరారు చేయవచ్చని అంటున్నారు. లాల్‌బిహారీ తివారీ మూడుసార్లు ఎంపీగా గెలిచారు. మహేష్ గిరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో సంబంధాలున్నాయి. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం ఉద్యమించిన ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ వ్యవస్థాపకుల్లో తాను  కూడా ఒకడినని తివారీ అంటుంటారు. కేజ్రీవాల్ నియంతృత్వ వ్యవహార శైలి నచ్చక ఆప్‌కు దూరమయ్యానని ఆయన చెబుతుంటారు. తివారీకి నితిన్ గడ్కరీ మద్దతు ఇస్తున్నార నే ప్రచారం ఉంది.
 
 న్యూఢిల్లీ సీటు కోసం ఇద్దరు దిగ్గజాల పోటీ 
 బీజేపీ అగ్రనేతలుగా పేరున్న నిర్మలా సీతారామన్, సుబ్రమణ్య స్వామి పేర్లు న్యూఢిల్లీ సీటు కోసం పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దక్షిణఢిల్లీ సీటు కోసం జాట్ నేతలు సరితా చౌదరి, మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు ప్రవేశ్ వర్మ పోటీ పడుతున్నారు. వాయవ్య ఢిల్లీ టికెట్  కోసం దళితనేత ఉదిత రాజ్ పేరు  పరిశీలనలో ఉందని అంటున్నారు. ఆయన ఇటీవలే బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. ఈశాన్య ఢిల్లీ సీటును ప్రముఖ పాత్రికేయుడు ఎంజే అక్బర్‌కు కేటాయించాల్సిందిగా నరేంద్రమోడీ సూచించినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఆప్ నగరంలోని ఏడు లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. కాంగ్రెస్ ప్రైమరీల ద్వారా ఒకరిద్దరు నేతలను ఎంపిక చేసింది. అందరికంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం తుది జాబితాను విడుదల చేసింది. ఇందులో న్యూఢిల్లీ, దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించించింది.  ఫరీదాబాద్ (హర్యానా) నుంచి పురుషోత్తం డాగర్, గౌతమబుద్ధనగర్ (ఉత్తరప్రదేశ్)  నుంచి కేపీ సింగ్ పోటీ చేస్తారని తెలిపింది. 
 
Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు