రైతు రక్తాక్షరాలు

14 Aug, 2018 13:23 IST|Sakshi
సీఎం కుమార స్వామికి రైతులు రక్తంతో రాసిన లేఖ, రైతులు తమ రక్తంతో సంతకాలు చేసిన దృశ్యం

సాగునీటి సౌకర్యం కల్పించాలని సీఎంకు హాసన్‌ జిల్లా రైతుల లేఖ

లేదంటే దయా మరణానికిఅనుమతివ్వాలని విన్నపం

బొమ్మనహళ్లి : కన్నడ నాట విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా ఉత్తర కర్ణాటక చుక్కనీరు లేక అల్లాడుతోంది.  ఈ నేపథ్యంలో తమకు సాగు, తాగునీటి సౌకర్యం కల్పించాలని కొందరు రైతులు తమ రక్తంతో ముఖ్యమంత్రి కుమారస్వామికి లేఖ రాశారు. కుమారస్వామి సొంత జిల్లా అయిన హాసన్‌ ప్రాంతం నుంచే లేఖ రాయడం గమనార్హం. హాసన్‌ జిల్లా చెన్నరాయపట్టణ తాలూకా బాగూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు తమకు సాగు, తాగునీటిని కల్పించాలని తమ రక్తంతో లేఖ రాయడంతో పాటు రక్తంతో సంతకాలు కూడా చేశారు.

బాగూరు గ్రామం సమీపంలో ఉన్న సొరంగ మార్గం కాలువలో నీరు లేదని, ఈ కాలువకు నీరు మళ్లించాలని, లేకుంటే ప్రజలతో పాటు పశువులు కూడా తాగునీటి కష్టాలు తప్పవన్నారు. భూగర్భ జలాలు సైతం ఇంకిపోవడంతో బోర్లలో సైతం నీరు లేదని, ఇక మాకు ఆత్మహత్యలే శరణ్యమని ఆ లేఖలో పేర్కొన్నారు. నీరు కల్పించలేని పరిస్థితి ఉంటే దయా మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో ప్రస్తావించారు. 

మరిన్ని వార్తలు