Manganese Benefits: మాంగనీస్‌... రక్తనాళాలు సాఫ్‌!

3 Nov, 2023 12:58 IST|Sakshi

మాంగనీస్‌... రక్తనాళాలు సాఫ్‌! పళ్లపై గారపడితే... డెంటిస్ట్‌తో తీయించుకోవచ్చు! కానీ... రక్తనాళాల గోడల్లోపల గారలాంటి గట్టి పొరలు ఏర్పడితే? ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. గుండెజబ్బులు, గుండెపోటులకూ దారితీయవచ్చు. అయితే రక్తనాళాల్లోపలి ‘ప్లేక్‌’ను ఇకపై తేలికగానే తొలగించవచ్చునని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదెలాగో చూసేయండి...

గుండెజబ్బులు వచ్చిన వారిలో రక్తం పలుచగా ఉంచేందుకు స్టాటిన్లు అనే రకం మందులు వాడుతూంటారు. రక్తనాళాల్లోని ప్లేక్‌ను ఈ మందులు కొంత వరకూ నియంత్రించగలవు. అయితే ఒకసారి ప్లేక్‌ ఏర్పడిన తరువాత మాత్రం ఈ స్టాటిన్ల ప్రభావం పెద్దగా ఉండదు. పేరుకుపోయిన ప్లేక్స్‌ను తొలగించలేవన్నమాట. ఈ సమస్యను అధిగమించేందుకు శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా... చైనాలోని వేర్వేరు యూనివర్శిటీల శాస్త్రవేత్తలు కలిసికట్టుగా జరిపిన పరిశోధనల్లో ఓ వినూత్న పరిష్కారం ఆవిషృ‍్కతమైంది. శరీరానికి అవసరమైన సాధారణ పోషకం మాంగనీస్‌ ఈ ప్లేక్‌ను రక్తనాళాల నుంచి తుడిచిపెట్టేయగలదని ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో స్పష్టమైంది.


మాంగనీస్‌ మన ఆరోగ్యానికి చాలా కీలకమైంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు జీర్ణమయ్యేందుకు కో ఎంజైమ్‌గా ఉపయోగపడుతూంటుంది. అంతేకాకుండా.. మన నాడులు, మెదడు బాగా పనిచేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తూంటుంది. కండరాలను కలిపే కణజాలం, సెక్స్‌ హార్మోన్లు, ఎముకలకూ చాలా అవసరం. సాధారణంగా మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు కావాల్సినంత మాంగనీస్‌ లభ్యమవుతూంటుంది. 

నట్స్‌, పచ్చటి ఆకు కూరలు, కొన్ని రకాల చేపలు, మిరియాలు, కాఫీ, టీ, గింజల వంటి వాటిల్లో మాంగనీస్‌ ఉంటుంది. శరీరంలో మాంగనీస్‌ తగ్గితే కండరాలు బలహీన పడతాయి. సంతానం కలగడంలో సమస్యలూ రావచ్చు. మూర్ఛ వచ్చేందుకూ అవకాశం ఉంటుంది. చైనా శాస్త్రవేత్తల తాజా పరిశోధనల కారణంగా ఇప్పుడు ఈ మాంగనీస్‌ రక్తనాళాల శుద్ధికీ ఉపయోగపడుతుందని స్పష్టమైంది.

చైనా శాస్త్రవేత్తలు ఎలుకలకు తగిన మోతాదులో మంగనీస్‌ అందించి పరిశీలించగా.. వాటి రక్తనాళాల్లో ప్లేక్‌ ఏర్పడేందుకు కారణమైన కొవ్వుల మోతాదు గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. అంతేకాదు.. ఏర్పడ్డ ప్లేక్‌ కూడా రక్తనాళాల గోడల నుంచి విడిపోయి శుభ్రమయైనట్లు కూడా తెలిసింది. ‘‘శరీరానికి అత్యవసరమైన మూలకాల్లో మాంగనీస ఒకటి. కానీ దీన్ని ఇప్పటివరకూ పూర్తిగా అర్థం చేసుకోలేదు.

ఎంజైమ్‌ ఆధారిత రియాక‌్షన్స్‌కు ఇదెలా సాయపడుతోందో తెలుసుకోలేదు’’ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త షావ్‌ వాంగ్‌ తెలిపారు. రక్తంలో కొవ్వుల రవాణా విషయంలో మాంగనీస్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తమ ప్రయోగాల ద్వారా వెల్లడైందని చెప్పారు. కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్ల వంటి సంక్లిష్ట కొవ్వులకు మాంగనీస్‌ అతుక్కుపోగలదని, తద్వారా అక్కడి రసాయన కూర్పును మార్చేయడం ద్వారా ప్లేక్‌ ఏర్పడకుండా నిరోధిస్తుందని వాంగ్‌ తదితరులు ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో తేలింది. పరిశోధన వివరాలను లైఫ్‌ మెటబాలిజమ్‌ జర్నల్‌ ప్రచురణకు స్వీకరించింది.

మరిన్ని వార్తలు