అక్రమాలతోనే ఇక్కట్లు

2 Aug, 2014 22:50 IST|Sakshi

 న్యూఢిల్లీ: అక్రమాలు, నిర్వహణ బాగా లేకపోవడం వల్లే ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ) రాష్ట్ర శాసనసభలో నిర్వహిస్తున్న క్యాంటీన్ నష్టాల పాలయినట్టు తేలింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలనలో ఈ విషయం వెల్లడయింది. నిర్వహణ వ్యయాన్ని మదింపు చేయకపోవడం, శాసనసభ సచివాలయంతో తగిన ఒప్పందం లేకుండానే సేవలు ప్రారంభించడంతో రూ.1.44 కోట్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. నష్టాలు వస్తున్నాయని తెలిసిన తరువాత కూడా దీనిని మూసివేయకపోవడం సరికాదని అభిప్రాయపడింది. క్యాంటీన్ నష్టాలను భరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, దీని నిర్వహణ నుంచి తప్పుకొని ఉండాల్సిందని కాగ్ నివేదిక పేర్కొంది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీలకు ఆహారం అందించేందుకు వీలుగా డీటీటీడీసీ 2007, సెప్టెంబర్ 10న క్యాంటీన్ ప్రారంభించింది.
 
 శాసనసభ సచివాలయం అధికారుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ క్యాంటీన్‌లోని రేట్లనే ఇక్కడా అమలు చేసేందుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే కంగన్‌కేరీ పర్యాటక భవనం నిర్వహణకు కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసేందుకు తగిన సలహాదారుణ్ని నియమించుకోవడంలో ఆలస్యం ఫలితంగా రూ. 5.67 కోట్ల నిధులు స్తంభించిన విషయాన్ని కూడా కాగ్ నివేదిక బయటపెట్టింది. పీతంపురా ఢిల్లీహాట్ పార్కింగ్‌కేంద్రం కాంట్రాక్టరు నుంచి ఆస్తిపన్ను వసూలు చేయకపోవడం వల్ల రూ.51.43 లక్షల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వివరించింది.
 

మరిన్ని వార్తలు