కులమతాలతో ఓట్లు కోరడం అవినీతే

3 Jan, 2017 03:18 IST|Sakshi
కులమతాలతో ఓట్లు కోరడం అవినీతే

సుప్రీం కోర్టు కీలక తీర్పు
జాతి, వర్గం, భాష పేర్లతోనూ ఓట్లు కోరకూడదు
ఎన్నికల్లో మతానికి చోటు లేదని స్పష్టీకరణ


న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి కులమతాలను వేరు చేసే దిశగా సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరిం చింది. ‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అని విస్పష్టంగా పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ సహా ఏడుగురితో కూడిన ధర్మాసనం సోమవారం ఈమేరకు 4:3 మెజారిటీ తేడాతో తీర్పునిచ్చింది. హిందుత్వం జీవన విధానమన్న తన 21 ఏళ్ల నాటి వివాదాస్పద తీర్పును సవరిస్తూ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘ప్రజాప్రాతినిధ్య (ఆర్‌పీ) చట్టం–1951లోని 123(3) సెక్షన్‌ ప్రకారం ‘అతని మతం’(హిజ్‌ రిలిజియన్‌) అంటే ఓటర్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు సహా అందరి కులమతాలూ అని అర్థం‘ అని జస్టిస్‌ ఠాకూర్, జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావులు(మెజారిటీ జడ్జీలు) స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో లౌకికవాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని జస్టిస్‌ లోకూర్‌ రాసిన తీర్పులో సూచించారు. అభ్యర్థి, ఎన్నికల ఏజెంట్, ప్రత్యర్థి, ఓటర్ల మతాల పేరుతో ఓట్లు కోరడం ఆర్‌పీ చట్ట ప్రకారం అవినీతి కిందికి వస్తుందని జస్టిస్‌ ఠాకూర్‌ చెప్పారు.

ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కొనసాగించేందుకు 123(3)కి విస్తృత, ప్రయోజనకర భాష్యం కావాలన్నారు. లౌకికవాదం మన రాజ్యాగ మౌలిక నిర్మాణంలో భాగమని, మతమనేది వ్యక్తిగత విషయమని అన్నారు. ‘రాజ్య వ్యవహారాలను మతం తో కలపడానికి వీల్లేదు. లౌకిక రాజ్యం ఏ మతంతోనూ గుర్తింపు పొందకూడదు. లౌకిక ప్రక్రియ అయిన ఎన్నికల్లో మతానికి చోటు లేదు’ అని స్పష్టం చేశారు. దేవుడిని మనిషి అనుసరించే మార్గాలు వ్యక్తిగత ప్రాధాన్యాలని పేర్కొన్నారు. మనలాంటి పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ సెక్షన్‌ను అభ్యర్థికి మేలు చేకూరేలా వ్యాఖ్యానించడం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా మారుతుందని జస్టిస్‌ లోకూర్‌ అన్నారు.

మైనారిటీ జడ్జీలు ఏమన్నారంటే..
మెజారిటీ జడ్జీలతో విభేదించిన జస్టిస్‌ యూయూ లలిత్, జస్టిస్‌ ఏకే గోయెల్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లు.. సెక్షన్‌ 123(3) ప్రకారం.. ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతమేనన్నారు. ఆర్‌పీ చట్టానికి ఎన్నో సవరణలు చేసినా ఈసెక్షన్‌ మాత్రం మారలేదన్నారు. కులమతాల కారణంగా అన్యాయానికి గురవుతున్న  ప్రజల న్యాయబద్ధమైన ఆందోళన గురించి మాట్లాడకుండా, చర్చించకుండా అడ్డుకుంటే ప్రజాస్వామ్యం అస్పష్టంగా మారుతుందన్నారు. ‘ఏ తరహా ప్రభుత్వమూ సంపూర్ణమైనది కాదు. అయితే ఇందులోని లోపాలను న్యాయవ్యవస్థ.. చట్ట నిబంధనను తిరగరాయడం ద్వారా పరిష్కరించకూడదు’ అని మైనారిటీ తీర్పు రాసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు .
కులమతాల పేర్లతో ఓట్లు అడగడం అవినీతా, కాదా అన్న దానికి సంబంధించిన ఎన్నికల చట్ట నిబంధన విస్తృతిపై విచారణ జరిపిన కోర్టు గత అక్టోబర్‌ 27న తీర్పు వాయిదా వేయడం తెలిసిందే.

గతంలో ఇచ్చిన తీర్పులో కోర్టు ‘అతని మతం’ అంటే అభ్యర్థి మతం మాత్రమే అని పేర్కొంది. మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉందని, అయితే ఎన్నికల కోసం మతాన్ని వాడుకోవచ్చా?అని ధర్మ సందేహం లేవనెత్తింది. 1990లోశాంతాక్రజ్‌ ఎమ్మెల్యేగా(బీజేపీ) తన ఎన్నికను బాంబే హైకోర్టు కొట్టేయడంతో అభిరాం సింగ్‌ సహా పలువురు వేసిన పిటిషన్లు కోర్టు విచారణలో ఉన్నాయి. ‘హిందుత్వ’ను ఉద్దేశించి చేసే విజ్ఞప్తి హిందువులను ఉద్దేశించి చేసినట్లు భావించకూడదని, హిందుత్వమనేది ఓ జీవన విధానమని 1995లో బెంచ్‌ సంచలన తీర్పు వెలువరించింది. 2002లో ఈ తీర్పును ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాలని కోర్టు నిర్ణయించింది. ఆర్‌పీ చట్టంలోని 123(3) వివరణ అంశాన్ని తేల్చాలని 2014లో కోర్టు ఏడుగురు జడ్జీల బెంచ్‌కు నివేదించింది.

>
మరిన్ని వార్తలు