Sakshi News home page

Indo-Islamic Cultural Foundation: అయోధ్యలో మసీదు నిర్మాణం.. మేలో ప్రారంభం

Published Mon, Dec 18 2023 4:56 AM

Indo-Islamic Cultural Foundation: Construction of proposed mosque in Ayodhya likely may 2024 - Sakshi

లక్నో: రామజన్మభూమి– బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలో ప్రతిపాదిత మసీదు నిర్మాణ పనులు వచ్చే ఏడాది మేలో ప్రారంభం కానున్నాయి. అయోధ్యలోని ధన్నిపూర్‌లో మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ తీసుకుంది. మసీదు నిర్మాణానికి అవసరమై నిధుల సేకరణకు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి వివిధ రాష్ట్రాలకు ఇన్‌చార్జుల నియామకాలు చేపట్టాలని ట్రస్ట్‌ యోచిస్తోంది.

ఫిబ్రవరిలో మసీదు తుది డిజైన్‌ను ఖరారు చేసి అధికారుల ఆమోదానికి పంపుతామని ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్, ఇండో–ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌ చీఫ్‌ ట్రస్టీ జుఫర్‌ ఫరూకీ తెలిపారు. ‘15 వేల చదరపు అడుగులకు బదులు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదు నిర్మాణం జరగనుంది. జవాబుదారీతనం, పారదర్శకత పాటిస్తూ నిధులు సేకరిస్తాం. ప్రభుత్వమిచ్చే భూమిలో మసీదుతో పాటు ఆస్పత్రి, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, మ్యూజియంలను కూడా నిర్మిస్తాం.

నిర్మాణ పనుల కోసం ముంబైకి చెందిన సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిధుల లభ్యతపైనే నిర్మాణ పనుల వేగం ఆధారపడి ఉంటుంది’’ అని ట్రస్ట్‌ సెక్రటరీ అథార్‌ హుస్సేన్‌ చెప్పారు. మధ్యప్రాచ్య మసీదుల శైలిలో రూపొందిన తొలి డిజైన్‌ తిరస్కరణకు గురవడం కూడా ఆలస్యానికి ఒక కారణమన్నారు. ప్రతిపాదిత మసీదు, ఇతర భవనాల డిజైన్‌ను మసీదు కమిటీ 2021లో అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీకి సమర్పించగా ఈ ఏడాది మార్చిలో అనుమతులు లభించాయి. కేంద్రం అయోధ్యలో ఐదెకరాలను యూపీ సున్ని సెంట్రల్‌ వక్ఫ్‌బోర్డ్‌కు అందజేయగా, బోర్డ్‌ మసీదు నిర్మాణ బాధ్యతలను ఇండో–ఇస్లామిక్‌ కల్చరల్‌ ఫౌండేషన్‌కు అప్పగించింది.

Advertisement

What’s your opinion

Advertisement