యూనిఫాంకు బదులు పోలీసులకు నగదు

16 Dec, 2014 23:31 IST|Sakshi

సాక్షి, ముంబై: పోలీసు శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి సిబ్బందికి ఇక నుంచి యూనిఫాం, ఇతర సామగ్రికి బదులుగా నగదు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు చేయనుంది.  ఒక్కొక కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు యూనిఫాం, బూట్లు, బెల్టు, క్యాపు, రివాల్వర్ కోసం లెదర్ బెల్టు, లాఠీ, రెయిన్ కోట్ తదితర సామగ్రి కొనుగోలుకు సంబంధించి రూ.5,167 చెల్లించనుంది.

అందుకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మొత్తం జనవరి లేదా ఫిబ్రవరి వేతనంలో పోలీసులకు అందనుంది. పోలీసు శాఖకు చెందిన ప్రథమ, ద్వితీయ స్థాయి పోలీసు అధికారులకు మాత్రమే యూనిఫాం, ఇతర సామగ్రి భత్యం గతంలో అందజేసేవారు. మిగతావారికి వస్త్రం కొనుగోలుచేసి ఇస్తే వారే కుట్టించుకునేవారు. అందుకు డబ్బులు చెల్లించేవారు. అయితే వేలాది మీటర్ల వస్త్రం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని, నాణ్యత కూడా ఉండడం లేదని అనేక ఆరోపణలొచ్చాయి. దీంతో నేరుగా పోలీసులకు నగదు అందజేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు