బాబూ.. మిమ్మల్ని దాటిపోతున్నాడు

5 Oct, 2016 08:37 IST|Sakshi
బాబూ.. మిమ్మల్ని దాటిపోతున్నాడు
  • అక్కడ పరిస్థితి అదుపు తప్పుతోంది
  • కట్టడి చేయకపోతే నష్టపోతాం
  • మంత్రి గంటాపై సీఎంకు అయ్యన్న వర్గం ఫిర్యాదు
  • లోకేష్ దృష్టికి కూడా వ్యవహారం?
  •  
    విశాఖపట్నం :  తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలకు మరోసారి తెరలేచింది. మంత్రి గంటా శ్రీనివాసరావు లక్ష్యంగా పార్టీలో ఆయన వ్యతిరేకవర్గం శరవేగంగా పావులు కదుపుతోంది. బినామీలు, అనుచరులు, బంధువుల పేరిట అడ్డగోలుగా వందల కోట్ల ఆస్తులు కూడబెడుతున్న గంటా నిర్వాకంతో పార్టీ పరువు భీమిలి సాక్షిగా సముద్రంలో కలిసిపోతోందని పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి మంత్రి అయ్యన్నపాత్రుడు వర్గం  లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
     
     ఇటీవలి కాలంలో మంత్రి గంటా బినామీల పేరిట భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాల్లో, మధురవాడ ప్రాంతంలో వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేశారు.. వివాదాస్పద డీ పట్టా భూములతో పాటు విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారి వెంబడి విలువైన స్థలాల కొనుగోళ్లు చేపట్టారు.. ఆయన ఇలాకాలో అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్న భూదందాతో పార్టీ పరిస్థితి దిగజారుతోంది.. రానున్న మహావిశాఖ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఇవన్నీ పార్టీపై ప్రభావం చూపుతాయి.. అని అయ్యన్న వర్గం బాబుకు వివరించినట్టు తెలుస్తోంది.
     
    ఈ మేరకు మంత్రి అయ్యన్నతో పాటు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేత మూడురోజుల కిందట విజయవాడలో బాబుతో భేటీ అయినట్టు సమాచారం. ఇప్పటికే వర్గ సమీకరణల పేరిట మిమ్మల్ని మించిపోయేటట్టు ఉన్నాడు.. పరిస్థితి చేయిదాటిపోకుండా కట్టడి చేయండి.. అని ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అన్నీ సావధానంగా విన్న చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటించినట్టు తెలుస్తోంది.
     
    బాబుతో పాటు నారా లోకేష్‌తో కూడా గంటా వ్యతిరేకవర్గం భేటీ అయి కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ పరిస్థితిని వివరించినట్టు తెలిసింది. కాగా, మంగళవారం నుంచి గుంటూరు జిల్లా కె.ఎల్.వర్సిటీలో మొదలైన టీడీపీ మేథోమథనం సదస్సు గురువారం వరకు జరగనుంది. ఈ సదస్సు ముగిసేలోపు మరోమారు బాబుతో భేటీ అయి గంటాపై ఫిర్యాదు చేయాలని అయ్యన్న వర్గం భావిస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు