'తెలంగాణలో నీటి కరువు తొలగిపోతుంది'

23 Aug, 2016 19:17 IST|Sakshi

ముంబయి: రాష్ట్రాలు సామరస్య ధోరణిలో వ్యవహరిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మూడు ప్రాజెక్టుల నిర్మాణంపై  తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఒప్పందం కుదరడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒప్పందానికి సహకరించినవారికి పేరు పేరునా కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఒప్పందం వల్ల తెలంగాణలో నీటి కరవు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా అంతకు ముందు గోదావరి నదిపై మూడు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ముంబైలోని... సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో గోదావరి అంతర్రాష్ట్ర బోర్డు సమావేశమైంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్‌లతో పాటు మంత్రులు, అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మేడిగడ్డ, తుమ్మిడిహెట్టి, చనఖా-కొరటా ఆనకట్టల ఎత్తుపై.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. ఇక ఒప్పందానికి సహకరించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను కేసీఆర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ముందుకు వెళ్తే కేంద్రం జోక్యాన్ని నివారించవచ్చని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నదీ జలాల కేటాయింపులు, వినియోగంపై నిత్యం వివాదాలే ఉండేవని, తమ వాదనను నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫడ్నవిస్ చెప్పారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఆ సమస్యలకు పరిష్కారం దొరికిందన్నారు.

మరిన్ని వార్తలు