యమునపై భారీ వారధి

7 Oct, 2014 23:34 IST|Sakshi

 నోయిడా: ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్ మధ్య రాకపోకలు సాగించేవారి కష్టాలు ఇక తీరనున్నాయి. యమునానదిపై నిర్మించనున్న ఆరులేన్ల వారధి నిర్మాణ పనులు వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓఖ్లా బ్యారేజీకి సమాంతరంగా ఈ వంతెనను నిర్మిస్తారు. 574 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయితే కాళిందీకుంజ్ వంతెనపై ట్రాఫిక్ భారీగా తగ్గే అవకాశముంటుంది. ఢిల్లీ నుంచి నోయిడా, ఫరీదాబాద్‌ల మధ్య రాకపోకలు సాగించేవారికి ప్రస్తుతం కాళిందీకుంజ్ వంతెన మాత్రమే మార్గం. నూతనంగా నిర్మిస్తున్న వంతెన అందుబాటులోకి వస్తే మరో ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వచ్చినట్లే. కాళిందీకుంజ్ వంతెనపై ప్రస్తుతం రోజుకు 1.5 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. కొత్తవంతెనతో వాహనాల సంఖ్య సగానికిపైగా తగ్గే అవకాశముంటుందని చెబుతున్నారు.
 
 నోయిడా అథారిటీ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం... ఈ నూతన వంతెన నిర్మాణానికి రూ. 139 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మొదట ఈ వంతెన నిర్మాణ పనులను ఫిబ్రవరిలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే అనేక కారణాలవల్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు వారం రోజుల్లో పనులు పూర్తిచేసి, రెండేళ్లలో వంతెనను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 17.3 మీటర్ల వెడల్పు, 574 మీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ వంతెన కోసం 15 పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి పిల్లర్ మధ్య 41 మీటర్ల దూరం ఉండేలా చూస్తారు. ఈ వంతెనపై ఆరులేన్ల రహదారిని ఏర్పాటు చేసుకోవచ్చు. పాదచారుల కోసం కూడా ప్రత్యేక ఫుట్‌పాత్ నిర్మించుకునే అవకాశం కూడా ఉంటుంది. మెట్రో ట్రాక్‌కు 40 మీటర్ల దూరంలోనే ఈ వంతెన ఉంటుంది. ప్రస్తుతం మెట్రో వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. బొటానికల్ గార్డెన్, కాళిందీకుంజ్ మధ్య ఈ మెట్రో వంతెన నిర్మిస్తున్నారు. నిజానికి ఈ వంతెన నిర్మాణం కోసం రెండేళ్ల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నోయిడా అథారిటీకి, నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ లిమిటెడ్‌కు మధ్య ఒప్పందాలు కూడా కుదిరాయి. నిర్మాణం, నిర్వహణ పద్ధతిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు