నగారా... రద్దు!

7 Aug, 2014 23:21 IST|Sakshi
నగారా... రద్దు!

సాక్షి, చెన్నై:రాష్ర్టంలోని తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ విజిలా సత్యానందన్, తూత్తుకుడి మేయర్ శశికళ పుష్ప లు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంపీలుగా బాధ్యతలు చేపట్టినానంతరం మేయర్ పదవులకు రాజీనామా చేశారు. అలాగే, కోయంబత్తూరు మేయర్ సేమా వేలుస్వామి పార్టీ అధినేత్రి జయలలిత ఆగ్రహానికి గురై పదవిని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో మూడు కార్పొరేషన్లకు మేయర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. అలాగే, మంత్రి కరుప్పు స్వామి మరణంతో ఖాళీ అయిన శంకరన్ కోవిల్ స్థానంలో ఆ మునిసిపాలిటీ చైర్మన్ ముత్తు సెల్వి నిలబడ్డారు.
 
 పుదుకోట్టై బరిలో ఆ మునిసిపాలిటీ చైర్మన్ కార్తిక్ తొండైమాన్ దిగారు. ముత్తుసెల్వి, కార్తిక్ తొండైమాన్‌లు ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్కారు. దీంతో ఈ రెండు మునిసిపాలిటీలకు చైర్మన్ పదవులు ఖాళీ అయ్యాయి. రామనాథపుర ం, విరుదాచలం, అరక్కోణం, కొడెకైనాల్, కున్నూరు మునిసిపాలిటీలకు చైర్మన్ పదవులు ఖాళీ ఏర్పడ్డాయి. వీటితో పాటుగా పట్టణ పంచాయతీలు, యూనియన్ పంచాయతీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వార్డు మెంబర్ల పదవులు వెయ్యి వరకు ఖాళీగా ఉన్నాయి. ఈ పదవుల భర్తీకి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం చర్యలు చేపట్టింది.
 
 నగారా : రెండు మేయర్లు, ఏడు మునిసిపాలిటీ చైర్మన్‌లు, మరో వెయ్యి పదవుల భర్తీకి ఉప ఎన్నికల నగారా బుధవారం ఉదయం మోగింది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు నిర్ణయించారు. నామినేషన్ల గడువు ఈ నెల 13న ముగించి, సెప్టెంబరు 18న ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విడుదల చేసింది. చడీ చప్పుడు కాకుండా ప్రకటన రూపంలో ఈ నోటిఫికేషన్ వెలువడింది. అయితే, ఏమయ్యిందో ఏమోగానీ రాత్రికి రాత్రే ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఎన్నికల యంత్రాంగం చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
 
 వాయిదా : ఎన్నికలు వాయిదా వేస్తూ చడీ చప్పుడు కాకుండా మరో ప్రకటనను అధికారులు విడుదల చేయటం చర్చనీయాంశంగా మారింది. విమర్శలు రావడంతోనే రాత్రికి రాత్రే నోటిఫికేషన్‌ను ఈసీ రద్దు చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. కోయంబత్తూరు కార్పొరేషన్ మేయర్‌పదవి ఖాళీగా ఉన్నా, దాని భర్తీకి ఈసీ చర్యలు తీసుకోలేదు. అక్కడ ఓటర్ల జాబితా సిద్ధం కాలేదని, వార్డుల విభజన పర్వానికి చర్యలు చేపట్టడాన్ని సాకుగా చూపి, అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోలేదు.  అలాగే, ఉప సమరానికి నోటిఫికేషన్ వెలువడ్డ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణకు చర్యలు తీసుకోవడం, గడువు తక్కువ సమయం కేటాయించడం వంటివి వ్యతిరేకతకు దారి తీశాయి. ఈ విషయంగా ఓ అధికారి పేర్కొంటూ, కోయంబత్తూరుతో పాటుగా ఖాళీగా ఉన్న అన్ని స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించేందుకు నిర్ణయించి ఉన్నామని పేర్కొన్నారు. అందుకే ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు అయిందని, మరో పది రోజుల్లో ఎన్నికల తేదీ ప్రకటించనున్నట్టు పేర్కొనడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు