చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి..

14 Jul, 2020 06:40 IST|Sakshi
బాధితురాలు భారతి 

సాక్షి, చెన్నై: సినిమాలో నటించాలన్న వ్యామోహం ఆ అమ్మాయిని పిచ్చిదాన్ని చేసింది. ఆశ నెరవేరకపోవడంతో మతితప్పిన స్థితిలో రోడ్డుపాలైంది ఆమె జీవితం. మానవత్వం మూర్తీభవించిన మహిళా ఇన్‌స్పెక్టర్‌ కంటబడి సురక్షితంగా శరణాలయానికి చేరింది. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. సడలింపులకు తావులేని సంపూర్ణ లాక్‌డౌన్‌ ఆదివారాలతో రాష్ట్రమంతా నిర్మానుష్యంగా మారిపోతోంది. చెన్నై మాధవరం కూడా అదే తీరులో బోసిపోయింది. ఆదివారం (12వ తేదీ) ఉదయం 7.30 గంటల సమయంలో చెన్నై సచివాలయ ఉద్యోగుల క్వార్టర్‌ పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే మహిళా ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరీ జీపులో గస్తీ తిరుగుతుండగా రోడ్డువారగా ఉన్న కుప్పతొట్టి వైపు దృష్టి మరలింది. వెంటనే మురుగన్‌ జీపు ఆపు, కొద్దిగా వెనక్కుపోనీ అంటూ డ్రైవర్‌ను ఆదేశించింది.

కుప్పతొట్టి పక్కనే చింపిరి జుట్టు, పూర్తిగా నలిగి మాసి, చిరిగిపోయిన చుడీదార్‌ దుస్తుల్లో కూర్చుని ఉన్న ఒక అందమైన అమ్మాయిని చూసి ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యపోయింది. జీపు నుంచి దిగి దగ్గరకు వెళ్లి చేయిపట్టుకుని నిలబెట్టింది. నీవు ఎవరు, ఇక్కడెందుకు ఉన్నావని ప్రశ్నించగా మీరు పోలీసా..నాకు ఆకలి వేస్తోంది.. ఏమైనా కొనిపెడతారా అని అడిగింది. ఇన్‌స్పెక్టర్‌ కంటితో సైగచేయగానే డ్రైవర్‌ జీపులోని ఫ్లాస్క్‌ నుంచి టీని కప్పులో పోసి తీసుకురాగా ఆ యువతి ఆత్రంగా తాగేసింది. వెంటనే పరుగు పరుగున మరలా కుప్పతొట్టి వద్దకు వెళ్లి తన బ్యాగును చేతిలోకి తీసుకుంది. ఆ యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కడుపునిండా భోజనం పెట్టించింది. పోలీస్‌స్టేషన్‌లోని బాత్‌రూములో మహిళా కానిస్టేబుళ్లు స్నానం చేయించి, డ్రైవర్‌ చేత కొత్త దుస్తులను తెప్పించి తొడిగారు. ఆ తరువాత ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి మెల్లమెల్లగా మాటలు కలుపుతూ ఆ యువతి వివరాలను సేకరించడం ప్రారంభించింది. (త‌మిళ‌నాడు : ర‌వాణాకు బ్రేక్..లాక్‌డౌన్ పొడిగింపు)

అభిషేక్‌ బచ్చన్‌ కోసం అయినవారిని విడిచి 
ఆ యువతి పేరు భారతి. ఆమె తండ్రి చెన్నై శాస్త్రీభవన్‌లో ఉద్యోగం చేసి ఉద్యోగ విమరణపొందారు. తల్లిదండ్రులు మరణించగా, చెన్నై పులియంతోపులో అత్త ఉన్నట్లు చెప్పింది. పోలీసులు సుమారు గంటపాటు వెతికి అత్తను కనుగొని స్టేషన్‌కు తీసుకొచ్చారు. భారతిని అప్పగించే ప్రయత్నం చేయగా అత్త నిరాకరించింది. ఆవడిలో ఉన్న ఆ యువతి చెల్లి ఇంటికి తీసుకెళ్లారు. భారతి గురించి ఆమె పోలీసులకు వివరించింది. ‘మేము మొదట్లో కొడుంగయ్యూరులో ఉండేవారము. మా పెద్ద అక్కకు క్రికెట్‌ అన్నా, సచిన్‌ టెండూల్కర్‌ అన్నా మహా పిచ్చి. అతడినే పెళ్లి చేసుకుంటానని మొండికేసేది. అతనికి పెళ్లయిందని వారించాం. ఆ తరువాత యువరాజ్‌సింగ్‌పై మోజు పెంచుకుని పెళ్లాడుతానని చెప్పేంది. 2008లో యువరాజ్‌సింగ్‌కు నిశ్చితార్థం జరగడంతో అదే రోజున ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మా కుటుంబాన్ని కుంగదీసింది. 2016లో రిటైరైన మా నాన్న కొద్ది కాలానికి మరణించారు. ఆ తరువాత అమ్మ కూడా చనిపోయింది.

ఇదిలా ఉండగా, భారతి అక్క చెన్నైలోని ఒక కాలేజీలో బీఎస్సీ పూర్తిచేసింది. కాలేజీలో చదివే రోజుల్లోనే సినిమా వ్యామోహం ఎక్కువ. అభిషేక్‌ బచ్చన్‌ అంటే ఎంతో ఇష్టం. పెళ్లి సంబంధాలు చూస్తుండగా చేసుకుంటే అభిషేక్‌ బచ్చన్‌నే చేసుకుంటానని మొండికేసి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేది. క్రమేణా పిచ్చిదానిలా మారిపోయింది. జరిగిందేదో జరిగిపోయింది, మీ అక్కను ఇక్కడే వదిలిపెడతామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పగా  ‘అయ్యో ఇది ఇంట్లో ఒక్క నిమిషం ఉండదు, దీన్ని గమనించుకోవడం నా వల్ల కాదు’ అని నిరాకరించింది. ఈ పరిణామంతో భారతిని మరలా పోలీస్‌స్టేషన్‌కు చేర్చి అనాథ శరణాలయానికి ఫోన్‌ చేయగా ‘సారీ మేడమ్‌ కరోనా కారణంగా కొత్తవారిని చేర్చుకోవడం లేదు’ అని నిరాకరించారు. చెన్నై కార్పొరేషన్‌ ఆరోగ్య విభాగంలోని తన స్నేహితురాలైన మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మోహనప్రియకు ఫోన్‌ చేసి భారతి దయనీయ పరిస్థితిని వివరించగా అంగీకరించింది. కరోనా పరీక్షలు చేసి ఏదో ఒక శరణాలయానికి పంపుతానని మోహన ప్రియ తెలిపింది.

కార్పొరేషన్‌ కార్యాలయానికి పంపేందుకు జీపు ఎక్కిస్తుండగా, ‘అమ్మా అందరూ నాకు పిచ్చి అంటున్నారు.. నిజంగా నాకు పిచ్చి ఉందా’ అంటూ భారతి అమాయకంగా ప్రశ్నించగా, నీకు పిచ్చా ఎవరు చెప్పారు, పిచ్చిలేదు ఏమీ లేదు, పోయిరా అంటూ ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి సాగనంపింది. మతిస్థిమితం కోల్పోయినపుడు ఆసుపత్రిలో చేర్పించవచ్చుకదా అని తోబుట్టువు, బంధువులను ప్రశ్నించగా చాలా ఖర్చవుతుందని చెప్పడం బాధాకరమని రాజేశ్వరి అన్నారు. ఎంతో అందంగా ఉన్న ఈ అమ్మాయి దుర్మార్గుల చేతిలో చిక్కి ఉంటే.. తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల్లో కఠినాత్ములే కాదు జాలి, దయ గలిగిన మానవతా మూర్తులు కూడా ఉంటారని నిరూపించిన ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరిని అందరూ పొగడ్తల వర్షంతో ముంచెత్తుతున్నారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా