షీలాకు జరిమానా

29 Oct, 2013 01:29 IST|Sakshi
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తాపై దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాని సీఎం షీలా దీక్షిత్‌కు స్థానిక కోర్టు రూ.ఐదు వేల జరిమానా విధించింది. జనవరి 27న తప్పకుండా కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఫిర్యాదుదారు దీక్షిత్ కోర్టుకి రావాలని గతంలోనే ఆదేశించినా ఆమె పట్టించుకోకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నమ్రితా ఆగర్వాల్  రూ.ఐదు వేల జరిమానాను  విధించారు. ఈసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దీక్షిత్ పెట్టుకున్న అభ్యర్థనను మన్నించిన ఆమె తదుపరి విచారణ తేదీ 2014, జనవరి 27న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. 
 
 వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా తయారుచేసే పనిలో నిమగ్నమవడంతో పాటు ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని షీలా తరఫు న్యాయవాది అన్నారు. ఇదే కోర్టు నుంచి గతంలో ఆదేశాలు వచ్చినా పట్టించుకోకుండా సీఎం షీలా దీక్షిత్ తెలివి తక్కువదని గుప్తా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితుడు కావడంతో కావాలనే తన క్లయింట్‌ను వేధిస్తున్నారని గుప్తా తరఫు న్యాయవాది అజయ్ బుర్మన్ అన్నారు.డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా గుప్తా కోర్టు ముందు హాజరయ్యారని తెలిపారు. గతేడాది జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విద్యుత్ కంపెనీలతో లలూచీపడి సహాయం తీసుకున్నానని అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించిన గుప్తాపై దీక్షిత్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
 
>
మరిన్ని వార్తలు