ఢిల్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ప్రచారం | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ప్రచారం

Published Tue, Oct 29 2013 1:26 AM

Electronic campaign  in  Delhi elections

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం కొత్తపుంతలు తొక్కుతోంది. అరవింద్ కేజ్రీవాల్ మోసగాడని, అన్నా హజారే కు వెన్ను పోటు పొడిచిన వ్యక్తి ఎవరినైనా మోసగించగలడని వాయిస్ రికార్డెడ్ కాల్స్‌తో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోంది. దీన్ని తిప్పికొట్టేందుకు ఆప్ పార్టీ తమకు ఓటు వేయాల్సిన అవశ్యకతను ఓటర్లకు వివరించే ప్రీరికార్డెడ్ కాల్స్‌తో సందేశాలను అందించడం ప్రారంభించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, దాని నేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఓటు  వేయరాదని హెచ్చరిస్తూ ఈ నెలారంభంలో పలువురు మొబైల్ ఫోన్ వాడకందారులకు కాల్స్ వచ్చాయి.
 
 అరవింద్ కేజ్రీవాల్, అన్నాహజారే నేతృత్వంలో ఇండియా అగెనెస్ట్ కరప్షన్ నిర్వహించిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తాను పనిచేశానని, కానీ ఆ తరువాత  కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కుమ్మక్కై అన్నాకు వెన్నుపోటు పొడిచారని, తన వారిని మోసగించిన వ్యక్తి ఎవరికైనా ద్రోహం చేయగలడని, కాబట్టి రానున్న ఎన్నికలలో కేజ్రీవాల్‌కు, అతని పార్టీకి ఓటు వేయరాదని చెబుతూ రికార్డు చేసిన శ్రీఓమ్ అనే ఓ వ్యక్తి సందేశం మొబైల్ ఫోన్ల ద్వారా పలువురికి చేరింది. ఇటీవల ఎన్నికల అనంతరం అర్వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతాడు కనుక బీజేపీకే ఓటువేయాలని కోరుతూ రికార్డు చేసిన వాయిస్ మెసేజ్  పలువురు మొబైల్ వినియోగదారులకు వచ్చింది.
 
 ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని, దేశ రాజధానిని గణనీయంగా అభివృద్ధిచేసిన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని కోరుతూ మరో వాయిస్ మెసేజ్  కూడా ఓటర్లకు అందుతోంది. 
 ఈ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకూడా వాయిస్ రికార్డు చేసిన కాల్స్‌తో రంగంలోకి దిగింది. ‘‘నమస్తే నేను అర్వింద్ కేజ్రీవాల్‌ను మాట్లాడుతున్నాను అంటూ ప్రారంభమయ్యే ఈ కాల్ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం కుమ్మక్కయ్యాయని, కాబట్టి ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటు వేయాలని శ్రోతలకు చెబుతోంది. ఓటర్లకు ఇటువంటి కాల్స్‌ను చేరవేయడం కోసం నగరంలోని 20 లక్షల మొబైల్ వినియోగదారుల డేటాబేస్ ఆమ్ ఆద్మీ పార్టీ వద్ద ఉందని, ప్రీ రికార్డు చేసిన మెసేజ్‌ను పార్టీ తరపున వినియోగదారులకు అందచేసేందుకు ఓ ప్రయివేటు కంపెనీకి 7-9 లక్షల  రూపాయలు చెల్లిస్తుందని ఆప్ కార్యకర్త చెప్పారు. 
 
 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇలాంటి కాల్స్‌పై స్వచ్ఛందంగానైనా లేదా ఎవరైనా ఫిర్యాదుచేసినా ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పరిశీలించవచ్చు. ఫోన్ కాల్‌లో వాడిన భాషను బట్టి అది పరువు నష్టం కిందకు వస్తుందా రాదా? అన్నది నిర్ణయించి, ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కాల్ చేసినవారిపై కేసు నమోదుచేయవచ్చు. ఇలాంటి ఫోన్‌కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియనప్పుడు ఆ కాల్ చేసిన వ్యక్తి లేదా వ్యక్తుల బృందం, సంస్థ ఆచూకీ తెలుసుకుని చర్య తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉంటుంది.  
 
 అయితే ఆమ్ ఆద్మీ పార్టీపై బురద చల్లే ఈ కాల్స్‌ని తాము పంపడం లేదని  కాంగ్రెస్, బీజేపీలు అంటున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల తాము అటువంటి పిచ్చిపని చేయబోమని, సానుభూతి కొరకు ఆమ్ ఆద్మీ పార్టీయే అటువంటి కాల్స్ చేస్తోండవచ్చని  బీజేపీ సందేహాన్ని వ్యక్తంచేసింది. 1.7 కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో నాలుగు కోట్లకు పైగా మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని ఢిల్లీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే సగటున ఒక్కో వ్యక్తి దగ్గర రెండు కనెక్షన్లు ఉన్నాయన్న మాట. వినియోగదారులు ఈ కాల్స్‌ను నివారించడం కోసం డు నాట్ కాల్ రిజిస్ట్రీలో తమ పేరు నమోదు చేసుకోవచ్చు.  ఈ రిజిస్ట్రీలో ఇప్పటివరకు 20 శాతం మొబైల్ వాడకందారులు తమ పేర్లు నమోదుచేసుకున్నారు.
 

Advertisement
Advertisement