త్వరలో మూడు ఎఫ్‌ఓబీలు

4 May, 2014 23:46 IST|Sakshi

 గుర్గావ్: హర్యానా పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) నగరంలో త్వరలో మూడు పాదచార వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)లను నిర్మించనుంది. హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్ వద్ద నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జిల కోసం రూ. 7.44 కోట్లను వెచ్చించనుంది. సదరు ప్రతిపాదనను ఆమోదంకోసం హుడా ఉన్నతాధికారి పీసీ మీనా వద్దకు పంపింది. ఆమోదం లభించిన తర్వాత వీటి నిర్మాణానికి మూడు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని హుడా సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎ.కె.మాకెన్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్... నగరంలోకెల్లా అత్యంత కీలకమైన ప్రదేశమన్నారు.
 
 సిగ్నేచర్ టవర్స్, ఇఫ్‌కో చౌక్, సుభాష్ చౌక్, సెక్టార్-56 తదితర కీలక ప్రదేశాలను ఇది కలుపుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే అనేక బహుళ జాతి సంస్థలకు చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44 కూడా దీనికి అత్యంత సమీపంలోనే ఉన్నాయన్నారు. అత్యంత రద్దీగా ఉండే ఈ స్టేషన్ సమీపంలో రహదారులను దాటడం అత్యంత ప్రాణాంతకమన్నారు.  ఫోర్టిస్ ఆస్పత్రి, ఎపిక్ సెంటర్, ఇండస్ట్రియల్ సెక్టార్ 44లకు వెళ్లదలుచుకున్నవారు విధిలేని పరిస్థితుల్లో నగరవాసులు రహదారులను దాటుతున్నారని, అదే ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ కారణంగా అనేకమంది చనిపోతున్నారన్నారు.
 
 తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. కాగా ట్రాఫిక్ పోలీసులు అందించిన గణాంకాల ప్రకారం గడచిన మూడు సంవత్సరాల కాలంలో 1,403 మంది పాదచారులు రోడ్లు దాటుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాదచార వంతెనలను నిర్మించాలంటూ అనేకమంది హుడాను అభ్యర్థించారని మాకెన్ తెలిపారు. ఈ ఎఫ్‌ఓబీలను హుడా సిటీ సెంటర్ మెట్రో స్టేషన్‌తోపాటు మేదాంత మెడిసిటీ, సెక్టార్ 39లోగల మార్కెట్ వద్ద నిర్మించనున్నారు.
 

మరిన్ని వార్తలు