శశికళ ద్వారా కెప్టెన్కు రూ.750 కోట్లు

16 Jul, 2016 09:33 IST|Sakshi
శశికళ ద్వారా కెప్టెన్కు రూ.750 కోట్లు

సాక్షి, చెన్నై : ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అన్నాడీఎంకే తరఫున భారీ కానుక ముట్టినట్టు మాజీలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ.750 కోట్లు కెప్టెన్ ఖాతాలోకి చేరినట్టుగా ఆరోపణలు గుప్పిస్తూ, డీఎండీకే ట్రస్టులో మాయమైన రూ. ఐదు వందల కోట్ల వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు.  డీఎండీకే అధినేత విజయకాంత్ కింగ్ కావాలన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎదుర్కొన్నారు.
 
ఈ కూటమి అన్నాడీఎంకే షాడోగా, ఇందుకుగాను కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగోకు రూ. 1,500 కోట్లు అన్నాడీఎంకే ముట్టచెప్పినట్టు ఆరోపణలు ఎన్నికల సమయంలో గుప్పుమన్నాయి. అదే సమయంలో ఆ కూటమితో పొత్తు వద్దే వద్దంటూ డీఎండీకే ముఖ్య నేతలు తమ కెప్టెన్‌కు సూచించి, చివరకు టాటా చెప్పారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఇక డీఎండీకే పాతాళంలోకి చేరినట్టే అన్నట్టుగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ప్రభావం తో డీఎండీకేను వీడి డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరే వారి సంఖ్య పెరిగి ఉన్నది.
 
 అత్యధిక శాతం మంది డీఎంకేలోకి వస్తున్నారని చెప్పవచ్చు. అలాగే, డీఎండీకేను చీల్చి మక్కల్ డీఎండీకేను ఏర్పాటు చేసుకుని డీఎంకేలోకి విలీనానికి సిద్ధం అవుతున్న మాజీలు తమ కెప్టెన్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ. ఐదు వందల కోట్లను విజయకాంత్ కుటుంబం మింగేసిందంటూ డీఎండీకే మాజీలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా, అన్నాడీఎంకే నుంచి విజయకాంత్‌కు ఇటీవల భారీ కానుక ముట్టినట్టుగా ఆరోపణలు అందుకోవడం గమనార్హం.
 
 రూ.750 కోట్లు : డీఎంకే చేతికి అధికారం చిక్కకుండా చేయడం లక్ష్యంగా ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో ఏమి ఏరుగని అమాయకుడిగా వ్యవహరించిన విజయకాంత్ నిజ స్వరూపం తాజాగా బయట పడిందని మక్కల్ డీఎండీకే నేత ఆరోపించే పనిలోపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ నేతృత్వంలో సేలం వేదికగా బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,  ముఖ్య నేత పార్తీబన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు వ్యతిరేకం..వ్యతిరేకం అంటూ , చివరకు ఆ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించడంలో విజయకాంత్ కూడా కీలక భూమిక పోషించి ఉన్నారని ఆరోపించారు.
 
  పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన అని వ్యాఖ్యలు చేసిన విజయకాంత్‌కు అవినీతి సొమ్ము కోట్లల్లో ముట్టి ఉన్నదని ఆరోపణలు గుప్పించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రావడం లక్ష్యంగా చేసుకున్న లోపాయికారి ఒప్పందానికి తగ్గ కానుక విజయకాంత్‌కు ఇటీవల లభించినట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ. 750 కోట్లు విజయకాంత్ గుప్పెట్లోకి చేరి ఉన్నదని ఆరోపించారు. అవినీతి గురించి డైలాగులు వళ్లించే విజయకాంత్ సినిమాల్లోనే హీరో అని, వాస్తవిక జీవితంలో విలన్‌గా మారి ఉన్నారని ధ్వజమెత్తారు.
 
 విజయకాంత్ బండారం బయట పడి ఉన్నదని, అందుకే  ఆపార్టీ గుడారం ఖాళీ కానున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే నుంచి 90 శాతం మంది బయటకు రానున్నారని, ఇందులో 70 శాతం మంది తమతో కలిసి డీఎంకేలో చేరనున్నట్టు ప్రకటించారు. సేలం వేదికగా ఈనెల 17న జరగనున్న బహిరంగ సభతో డీఎంకే దళపతి స్టాలిన్ సమక్షంలో మక్కల్ డీఎండీకేను విలీనం చేయనున్నామని ప్రకటించారు.
 
 విజయకాంత్‌కు వ్యతిరేకంగా త్వరలో కోర్టుకు వెళ్లనున్నామని, పేదల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి మాయం చేసిన రూ. 500 కోట్లను కక్కిస్తామన్నారు. ఈట్రస్టు నుంచి ఇటీవల 1.15 కోట్లతో ఓ కారును సైతం కొనుగోలు చేసి ఉండడం బట్టి చూస్తే, విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ ఏ మేరకు అవినీతికి పాల్పడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నాని పేర్కొన్నారు. ఆ ట్రస్టు వ్యవహారాలు, నిధులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమా..? అని ఈ సందర్భంగా విజయకాంత్‌కు సవాల్ విసిరారు.
 

మరిన్ని వార్తలు