దుర్గమ్మ ఆలయ సిబ్బందిపై వేటు

5 Oct, 2016 09:28 IST|Sakshi
దుర్గమ్మ ఆలయ సిబ్బందిపై వేటు

విజయవాడ: దుర్గగుడిలో అమ్మవారికి మహానివేదనపై ఆలయ ఉన్నతాధికారులు ఆలస్యంగా స్పందించారు. ఈ అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఏఈవో, ఆలయ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో ఎ. సూర్యకుమారి బుధవారం వెల్లడించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని స్థానాచార్యలను కోరినట్లు ఆమె పేర్కొన్నారు.

మంగళవారం దుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో వీఐపీల తాకిడి కూడా అధికంగా ఉంది. ఆలయ అధికారులు వీఐపీల సేవలో తరించడంతో అమ్మవారికి సమర్పించే నివేదన ఆలస్యమైంది. మధ్యాహ్నం అమ్మవారికి నివేదన సమర్పించేందుకు ఆలయ అర్చకులు సిద్ధమయ్యారు. మేళతాళాలతో ఆలయ అర్చకులు నివేదనను తీసుకుని అమ్మవారి ముఖ మండపం వద్దకు చేరుకున్నారు.

అయితే అప్పటికే ఆలయం లోపల కొందరు వీఐపీలు ఉండటంతో వారు బయటకు వచ్చే వరకు నివేదనను పట్టుకుని అర్చకులు వేచి ఉండాల్సి వచ్చింది. అర్చకులు ఎంత పిలిచినా అంతరాలయంలో ఉన్నవారు బయటకు రాలేదు. వైదిక కమిటీ సభ్యులు శంకర శాండిల్య ఆగ్రహంతో గట్టిగా కేకలు వేయడంతో వీఐపీలు బయటకు వచ్చారు. ఆ తర్వాత అమ్మవారికి మహా నివేదన చేయవలసి వచ్చింది.

మరిన్ని వార్తలు