గరిష్ట వేగం 25 కి.మీ. లోపే

16 Sep, 2014 22:56 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఈ-రిక్షాలపై రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ఆంక్షలను విధించనుంది. ఈ శాఖ మంగళవారం జారీచేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం నగరంలో ఇకమీదట 25 కిలోమీటర్ల వేగానికి మించి నడపకూడదు. అంతేకాకుండా వాటిల్లో నలుగురు ప్రయాణికులను మించి ఎక్కించుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెసైన్సు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కు ముప్పని, అంతేకాకుండా నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది జూలై 31వ తేదీన వీటి సంచారంపై నిషేధం విధించిన సంగతి విదితమే.
 
 రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం  ఈ-రిక్షాలకు ఫిట్నెస్ పత్రాలు తప్పనిసరి. కేంద్ర మోటారు వాహనాల చట్టం, 1989లో సవరణలను చేపట్టేందుకుగాను పదిరోజుల్లోగా ఈ ముసాయిదా నోటిఫికేషన్‌పై స్పందించాల్సిందిగా ఈ-రిక్షా చోదకులను కోరింది. తమ తమ అభ్యంతరాలు లేదా సలహాలు, సూచనలను రవాణా శాఖ కార్యదర్శికి పంపాల్సి ఉంటుందని సదరు నోటిఫికేషన్ పేర్కొంది. 1988నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. వీటి గరిష్ట వేగం 25 కిలోమీటర్లకు మించకూడదని, అంతేకాకుండా దీని మోటార్ విద్యుత్ సామర్థ్యం 200 వాట్లను దాటకూడదంది. డ్రైవర్‌ను మినహాయించి నలుగురికి మించి ప్రయాణికులను అందులో తీసుకెళ్లకూడదంది. ఇక లగేజీ 40 కిలోలను మించకూడదంది. డ్రైవింగ్ లెసైన్సు కాలపరిమితి జారీ అయిన తర్వాత నాటి నుంచి మూడు సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత దానిని రెన్యువల్ చేసుకోకూడదని తెలిపింది. పరీక్షల తరువాతే వీటికి ఫిట్‌నెస్ పత్రాలను జారీచేస్తారు.
 
 నిర్దేశిత మార్గాల్లోనే వీటిని నడపాల్సి ఉంటుంది. బ్యాటరీ ఆధారిత వాహనమని, ఇది మూడు చక్రాలపై నడుస్తుందంటూ ఈ-రిక్షాను ఈ నోటిఫికేషన్ అభివర్ణించింది. ప్రయాణికుడిని గమ్యస్థానం వరకూ చేర్చే వాహనమని పేర్కొంది. లైట్లు, వీల్ రిమ్ములు, బ్యాటరీ తదితరాలకు సంబంధించి వీటి యజమానులు ఎట్టిపరిస్థితుల్లోనూ కొన్ని ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందంది.కాగా ఈ-రిక్షాలకు సంబంధించి పదిరోజుల్లోగా ఓ నోటిఫికేషన్‌ను జారీచేస్తామంటూ రోడ్డు రవాణా, హైవేస్ శాఖ మంత్రిత్వ నితిన్ గడ్కరీ సోమవారం ప్రకటించిన సంగతి విదితమే. అంతేకాకుండా ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని కూడా అన్నారు. వీటిపై నిషే ధం కారణంగా వీటిపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు వీధులపాలయ్యాయన్నారు.
 

మరిన్ని వార్తలు