కంటైనర్లలో రూ.570కోట్లు స్వాధీనం

14 May, 2016 10:02 IST|Sakshi
కంటైనర్లలో రూ.570కోట్లు స్వాధీనం

కోయంబత్తూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగదు ఏరులై పారుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కోట్ల రూపాయిలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల అధికారులు  భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా గతరాత్రి తనిఖీల్లో భాగంగా కోయంబత్తూరు, తిర్పూరు జిల్లాలో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది.

కోయంబత్తూరు బైపాస్ రోడ్డు వద్ద ఓ కంటైనర్లో రూ.195 కోట్లు సీజ్ చేయగా, తిర్పూరు జిల్లాలో  మూడు కంటైనర్లను ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ స్వాధీనం చేసుకుంది. ఆ కంటైనర్లలో రూ.570 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కంటైనర్లు కోయంబత్తూరు నుంచి విజయవాడ వెళుతున్నట్లు సమాచారం. అధికారుల విచారణలో భాగంగా విజయవాడ ఎస్బీఐ బ్యాంక్లో నగదును డిపాజిట్ చేసేందుకు వెళుతున్నట్లు కంటైనర్ డ్రైవర్ తెలిపాడు. స్వాధీనం చేసుకున్న కంటైనర్లను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలించారు. నగదు తరలింపుపై విచారణ జరుపుతున్నట్లు తమిళనాడు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజేశ్ లహోని తెలిపారు. కాగా కంటైనర్లతో పాటు ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు, సంస్థ యూనిఫాంలో లేడని, అంతేకాకుండా నగదు తరలింపుపై అతని వద్ద పూర్తి వివరాలతో కూడిన పత్రాలు లేవన్నారు.

కాగా ఈనెల 16వ తేదీ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.  ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం అనేక రకాలైన చర్యలు చేపట్టింది. అయినప్పటికీ.. రాజకీయ పార్టీలు యధేచ్చగా నగదు పంపిణీలో నిమగ్నమైపోయాయి. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ తమిళనాడులో సుమారు రూ.100 కోట్లు అక్రమ నగదును అధికారులు సీజ్ చేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంత భారీగా నగదును సీజ్ చేయడం దేశంలోనే ప్రథమం. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు