మరోసారి ‘షాక్’

1 Sep, 2013 23:13 IST|Sakshi
సాక్షి, ముంబై: మరోసారి విద్యుత్ చార్జీలతో ముంబైకర్ల నడ్డివిరించేందుకు బృహన్‌ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇదివరకే పెంచిన విద్యుత్ చార్జీలతో వినియోగదారులు బెంబేలెత్తుతుండగా, మరోసారి షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమయింది. కొత్త చార్జీలు సోమవారం (సెప్టెంబర్ ఒకటి) నుంచి వర్తిస్తాయి. అంటే అక్టోబరు బిల్లు కొత్త చార్జీలతో వస్తుందని బెస్ట్ విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు. చార్జీలు పెంచేందుకు మహారాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఎంవీఆర్‌సీ) ఇటీవలే అనుమతి ఇవ్వడం తెలిసిందే. దీంతో ముంబైకర్లపై విద్యుత్ చార్జీల భారం మోపేందుకు బెస్ట్‌కు మార్గం సుగమమయింది. 
 
 కొలాబా నుంచి బాంద్రా, సైన్ వరకు ఉన్న బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై బిల్లుల భారం పడనుంది. ప్రతీనెల 100 యూనిట్ల వరకు విద్యుత్ వాడే వినియోగదారులకు రూ.39, అలాగే నెలకు 300 యూనిట్లు వాడే సామాన్య వినియోగదారులకు రూ.207 చొప్పున అదనంగా వడ్డించనున్నారు. కొలాబా మొదలుకుని పశ్చిమ శివారులోని మాహిం వరకు, తూర్పు శివారు ప్రాంతంలో సైన్ వరకు బెస్ట్ కరెంటు సరఫరా చేస్తోంది. 
 
 మిగతా శివారు ప్రాంతాల్లో రిలయన్స్, బీఎస్‌ఈఎస్ తదితర డిస్కమ్‌లు విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. బెస్ట్ విద్యుత్ వినియోగదారుల్లో నివాసాలు, దుకాణాలు, పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన 10 లక్షల మంది ఉన్నారు. వీరందరి నెలవారీ కరెంటు బిల్లులు కనీసం 8.9 శాతం పెరగనున్నాయి. కొత్త ధరలు అమల్లోకి రావడంతో ఇళ్లలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించే వాళ్లు కూడా ఆందోళనకు గురవుతున్నారు. 
 
 నివాస వినియోగదారులకు వర్తించే కొత్త చార్జీల వివరాలివి
 యూనిట్లు     పాత ధర (యూనిట్‌కు)                  కొత్త ధర                     తేడా (పైసల్లో)  అదనపు భారం                 
 0-100         2.06                 2.45         39           రూ.39
 101-300     3.81                 4.50           69           రూ.207
 301-500     5.36                 6.35           99           రూ.495
 501- ఆపైన   6.86                 8.00         1.14           రూ.571
 
మరిన్ని వార్తలు