ప్రేమన్నాడు.. పెట్రోలు పోసి తగులబెట్టాడు

5 Jul, 2017 11:18 IST|Sakshi
ప్రేమన్నాడు.. పెట్రోలు పోసి తగులబెట్టాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఫేస్‌బుక్‌ సాక్షిగా ప్రేమన్నాడు.. దేవుడు సాక్షిగా పెళ్లన్నాడు.. పెద్దోళ్లను ఎదిరించి కలిసి బతకలేం కాబట్టి, కలిసి చనిపోదామని ఒప్పించాడు. ముందు నీవు చనిపో.. ఒక అమ్మాయిని హత్యచేసి ఆ తరువాత నేను ఆత్మహత్య చేసుంటానని కపటప్రేమ కనబరిచాడు. ఆ వెంటనే ఆ యువతిపై పెట్రోలు పోసి నిప్పటించి ప్రియుడు పారిపోయాడు. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ హృదయవిదారకమైన  సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు మంగళవారం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నై కొళత్తూరుకు చెందిన ఒక పారిశ్రామికవేత్త కుమార్తె (శక్తి) ఒక ప్రయివేటు కళాశాలలో రెండో ఏడాది డిగ్రీ చదువుతోంది. సేలం జిల్లాకు చెందిన మురళి అలియాస్‌ నారాయణన్‌తో ఫేస్‌బుక్‌ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రియుని పిలుపుమేరకు గతనెల 28వ తేదీన చెన్నై తాంబరానికి చేరుకోగా సదరు యువతిని కారులో మధురై, తంజావూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి బెంగళూరులో పెళ్లి చేసుకుందామని ప్రియుడు నమ్మించాడు. దీంతో యువతి సమ్మతించింది.

అయితే అకస్మాత్తుగా చెన్నైకి వెళదాం అని చెప్పి కడలూరు జిల్లా బన్రుట్టికి తీసుకొచ్చి అక్కడి ఒక ఆలయంలో తాళికట్టి పెళ్లి చేసుకుని సంతోషంగా గడిపారు. ఆ తరువాత ప్రియురాలితో.. నేను సొంతూరుకు వెళ్లాలి, ఇద్దరం కాపురం చేసేందుకు తగినంత డబ్బులేదు, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు వారు బాధపడతారు అని మాయమాటలు చెప్పాడు. ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారమని మొసలి కన్నీరు కార్చాడు. ప్రియుని మాటలు నమ్మిన బాధితురాలు సామూహిక ఆత్మహత్యకు సమ్మతించింది. పెట్రోలు పోసుకుని సజీవదహనం కావాలని నిర్ణయించుకున్నారు.

బన్రుట్టి సమీపం కానంజావడి గ్రామంలోని ముంతమామిడి తోటలోకి ప్రియురాలిని తీసుకెళ్లిన ఆ యువకుడు ‘ముందు నీవు చనిపో, ప్రేమపేరుతో నన్ను మోసం చేసిన ఒక అమ్మాయిని హతమార్చి ఆ తరువాత నేను ఆత్మహత్య చేసుకుంటా..’ అంటూనే హఠాత్తుగా ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ప్రియురాలు మరణం ఖాయమని నమ్మి కారులో పరారయ్యాడు. శరీరం తగలబడిపోతున్న దశలో యువతి స్పృహతప్పి పోయింది. ఈనెల 1వ తేదీన కాలిన గాయాలతో యువతి విలవిల్లాడుతుండగా ఒక అంబులెన్స్‌ డ్రైవర్‌ గమనించి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు. సుమారు యాభైశాతానికి పైగా కాలిపోయిన స్థితిలో తల్లిదండ్రుల వద్దనే ఉంటూ ఆమె చికిత్స పొందుతోంది.  
మరిన్ని వార్తలు