Killer Mom: ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి.. ‘పాపమంతా ఫేస్‌బుక్‌దే’

15 Nov, 2023 18:11 IST|Sakshi

అమెరికాకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను అత్యంత కిరాతకంగా కాల్చి చంపింది. కానీ తాను కావాలని చంపలేదని, తనను ఫేస్‌బుక్‌ ప్రభావితం చేసిందని వింత కారణం చెబుతోంది. 

‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఈ ఘోరం చేసిన మహిళను 32 ఏళ్ల టిఫానీ యాన్ కేథరీన్ లూకాస్‌గా గుర్తించారు. ఆమె తన ఇద్దరు కొడుకులు ఆరేళ్ల మారిస్ బేకర్ జూనియర్, తొమ్మిదేళ్ల జేడెన్ హోవార్డ్‌లను నవంబరు 8న కెంటకీలోని తమ నివాసంలో తుపాకీతో కాల్చింది. రక్తపు మడుగులో పడివున్న పిల్లలను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. ఇంతటి ఘోరం చేసిన ఆమె ఇతరులకూ ప్రమాదకరమని పేర్కొన్న న్యాయమూర్తి.. విచారణ ముగిసే వరకూ 2 మిలియన్‌ డాలర్ల (రూ.16.6 కోట్లు) పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.

నవంబర్‌ 14న కోర్టు విచారణ సందర్భంగా బుల్లిట్ కౌంటీ షెరీఫ్  అనే దర్యాప్తు సంస్థకు చెందిన డిటెక్టివ్ రిచర్డ్ బీల్.. తాను విచారించినప్పుడు నిందితురాలు లూకాస్‌ తనతో ఏం చెప్పిందో కోర్టుకు తెలియజేసింది. ‘న్యూస్‌వీక్’ కథనం ప్రకారం.. ఇద్దరు పిల్లలను తలపై దాదాపు 30 సెకన్లలో నాలుగు షాట్లు కాల్చారని బీల్ వెల్లడించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని, తనను ఎవరో ఫేస్‌బుక్‌ ద్వారా "మానిప్యులేట్" చేశారని లూకాస్‌ చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు.

అయితే లూకాస్‌ వాదనను మారిస్ బేకర్ జూనియర్ సవతి తల్లి మిచెల్ రైస్ ఖండించారు. ఆమె కావాలనే పిల్లలను చంపేసిందని, ఇంత క్రూరమైన పని చేసేలా ఎవరూ ప్రభావితం చేయరని రైస్‌ తెలిపినట్లు ఫాక్స్ అనుబంధ డబ్ల్యూడీఆర్‌బీ కథనం పేర్కొంది.

మరిన్ని వార్తలు