రంకెలేసి.. ప్రాణం తీసి

17 Jan, 2018 06:46 IST|Sakshi

జల్లికట్టులో అపశ్రుతి

ఎద్దులు పొడిచి నలుగురు మృతి

రాష్ట్రంలో జోరుగా జల్లికట్టు

అలంగానల్లూరులో ప్రారంభించిన సీఎం

తమిళనాడు ప్రజలకు ప్రీతిపాత్రమైన జల్లికట్టులో అపశుృతి చోటుచేసుకుంది. ఎద్దులదాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  మరో 50 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్రంలో జల్లికట్టు ఉత్సాహంగా సాగుతోంది. అలంగానల్లూరులో జల్లికట్టును సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రారంభించారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలూ, వడలూ పాయసాలు కంటే జల్లికట్టు క్రీడలకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. అసలు జల్లికట్టు కోసమే  ఎదురుచూస్తుంటారు. జల్లికట్టు కోసమే బాగా బలిష్టంగా పెంచుతున్న ఎద్దును క్రీడావలయంలోకి వదలడం, ఆవి రెచ్చిపోతూ పరుగులు పెడుతుంటే వాటిని అణిచి అదుపుతోకి తీసుకున్న యువకులను విజేతలుగా ప్రకటిస్తారు. చూపరులకు అత్యంత ప్రమాదకరంగా కనపడే ఈ క్రీడలో పాల్గొనేందుకు తమిళనాడు యువకులు ఏ మాత్రం భయం లేకుండా ఉత్సాహం చూపుతారు. అయితే జల్లికట్టుకు వినియోగించే ఎద్దులకు మద్యం తాగిస్తారని, రెచ్చగొట్టేందుకు మరెన్నో చేస్తారని ప్రచారం ఉంది. అలాగే ఎద్దులను అదుపుచేసే క్రమంలో వాటిని హింసిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు, జంతుప్రేమికులు కోర్టుకెక్కారు.

జల్లికట్టు క్రీడ ముసుగులో జంతువులను హింసిస్తున్నారంటూ ‘పీపుల్స్‌ ఫర్‌ ది ఎతికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పెటా) లేవనెత్తిన అభ్యంతరం మేరకు సుప్రీం కోర్టు రెండేళ్ల క్రితం నిషేధం విధించింది. జల్లికట్టు క్రీడపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ప్రజలు ఏ మాత్రం జీర్ణించుకోలేక పోయారు. జల్లికట్టు తమ ప్రాచీన సంప్రదాయ క్రీడగా అభివర్ణిస్తూ నిషేధం ఎత్తివేయాలంటూ గత ఏడాది ఆందోళన మొదలుపెట్టారు. చెన్నై మెరీనాబీచ్‌లో వేలాది ప్రజలు, యువతీ యువకులు, విద్యార్థ్ది సంఘాలు సంయుక్తంగా సాగించిన జల్లికట్టు పోరాటం యావత్‌దేశ దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచింది. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక ఆర్దినెన్స్‌ తేవడం, రాష్ట్రపతి ఆమోదించడంతో జల్లికట్టుపై నిషేధం తొలగిపోయింది. దీంతో గత ఏడాది జల్లికట్టును కోలాహలంగా జరుపుకున్నారు.

ఇక ఈ ఏడాది విషయానికి వస్తే 14వ తేదీనే జల్లికట్టు క్రీడలు మదురై జిల్లా ఆవనియాపురంలో, 15వ తేదీ పాలమేడులో ప్రారంభమయ్యాయి.  జల్లికట్టు క్రీడకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మదురై జిల్లా అలంగానల్లూరులో క్రీడాపోటీలను ముఖ్యమంత్రి ఎడపాడి , ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మంగళవారం ప్రారంభించారు. జల్లికట్టు క్రీడను కాపాడుకోవడం మన కర్తవ్యమని  ఎడపాడి పేర్కొనగా, జల్లికట్టు కోసం అలంగానల్లూరులో శాశ్వతమైన మైదానం ఏర్పాటుకు కృషి చేస్తామని పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. విజేతలకు కారు, బంగారు నాణేలు రూ. కోటి విలువైన ఆకర్షిణీయమైన బహుమతులు ప్రకటించారు. ఎవ్వరూ అదుపు చేయలేని ఎద్దుల యజమానులకు సైతం బహుమతులు అందజేశారు. 1,241 మంది జల్లికట్టు వీరులు, 1060 ఎద్దులతో నిర్వహించిన అలంగానల్లూరు జల్లికట్టు క్రీడలను వీక్షించేందుకు ఎప్పటి వలే పెద్ద సంఖ్యలో విదేశీయులు సైతం వచ్చారు. కొన్ని ఎద్దులకు రాష్ట్ర మంత్రుల పేర్లు పెట్టి బరిలోకి దింపడం విశేషం. అరియలూరు జిల్లా జయంకోటై్ట పుదుచ్చావడి గ్రామంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జల్లికట్టు నిర్వహించారు. కోర్టు నిబంధనల ప్రకారం జల్లికట్టుకు ఎంపిక చేసిన మైదానం విస్తీర్ణం సరిపోదు, సమీపంలో నివాసగృహాలు ఉన్నాయనే కారణాలతో జిల్లా కలెక్టర్, ప్రజాపనుల శాఖ అధికారులు సోమవారం రాత్రి అనుమతి నిరాకరించారు. అయితే అప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న నిర్వాహకులు మంగళవారం యథావిధిగా జల్లికట్టు నిర్వహించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

14నే ప్రారంభమైన మరణ మృదంగం: తమిళులు పొంగల్‌ అని పిలుచుకునే సంక్రాంతి పండుగ రోజుల్లో జల్లికట్టును జరుపుకుంటారు. ఈనెల 14వ తేదీన మదురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టు క్రీడలు నిర్వహించగా ఆరుగురు జల్లికట్టు వీరులు, 22 మంది వీక్షకులు గాయపడ్డారు. ఈనెల15వ తేదీన పాలమేడులో రెండోరోజు జల్లికట్టు పోటీలు జరుగగా ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న ఎమకలాపురానికి చెందిన కాలిముత్తు(19)ను ఎద్దు పొడవడంతో మరణించాడు. అలాగే తిరుచ్చిరాపల్లి మనకోటై్టలో మంగళవారం జరిగిన జల్లికట్టులో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చుని ఉన్న సోలైపాండి (26) అనే వ్యక్తి ఎద్దు పొడిచి ప్రాణాలు కోల్పోయాడు. శివగంగై జిల్లా శిరవయల్‌ గ్రామంలో మంజువిరాట్‌ పోటీలు మంగళవారం జరిగాయి. ఈపోటీలో భాగంగా ఎద్దులు, ఆవులను పెద్ద సంఖ్యలో ఒకేసారి వదులుతారు. ఈ పశువులు ఉరకలేస్తూ పరుగులుపెడుతూ ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లాయి. దీంతో రామనాథన్‌ (38), కాశీ (25) అనే ఇద్దరు మృతి చెందారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా