ఉల్లి వచ్చేసిందోచ్!

7 Oct, 2013 02:08 IST|Sakshi

 సాక్షి, ముంబై: ఈజిప్టు, పాకిస్థాన్‌తోపాటు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి నిల్వలు ముంబైకి వస్తుండడంతో ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) ఆవరణలోకి ఆదివారం భారీగా సరు కు చేరుకోవడంతో ముంబైకర్లకు త్వరలో చౌక ధరకే ఉల్లి లభిస్తుందని అధికారులు చెబుతున్నా రు. ఇదివరకు ఆకాశాన్నంటిన ఉల్లి ధరలతో బేజారవుతున్న ముంబైకర్లకు ఈ ఉల్లిరాకతో కొంతమేర ఊరట లభించనుంది.
 
 ఏపీఎంసీలోకి 56 టన్నుల చైనా ఉల్లి దిగుమతి కావడంతో టోకు వ్యాపారులకు దీన్ని రూ.37 కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధరలు అకస్మాత్తుగా పెరిగిపోవడంతో గృహిణుల ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. ధరలను నియంత్రించేందుకు వ్యాపారులు ఈజిప్టు, పాకిస్థాన్ నుంచి ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. అయినప్పటికీ మార్కెట్లో ఉల్లి ధరలు పెద్దగా తగ్గలేదు. దీంతో గత్యంతరం లేక వ్యాపారులు చైనా నుంచి రెండు కంటెయినర్ల (56 క్వింటాళ్లు) ఉల్లిని దిగుమతి చేసుకున్నారు. ఈ ఉల్లి ఏసీ కంటెయిన ర్‌లో రావడం వల్ల కొంత తడిగా ఉన్నాయి. అయినప్పటికీ ఆకారంలో ఇవి పెద్దగా ఉండడంతో ఒకే రోజు మొత్తంసరుకు అమ్ముడుపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. భారత్‌లో ఉల్లి సాగుకు నాసిక్ జిల్లా లాసల్‌గావ్, నిఫాడ్ ప్రాంతాలు ప్రఖ్యాతి చెందాయి. ప్రపంచంలో ఉల్లి పండించే దేశాల్లో చైనా ప్రథమస్థానంలో ఉండగా భారత్ రెండోస్థానంలో ఉంది. 2012లో చైనాలో 2,05, 07,759 మెట్రిక్ టన్నుల ఉల్లి ఉత్పత్తికాగా భారత్‌లో 2012లో 1,33,72,100 మెట్రిక్ టన్నుల ఉల్లి పండింది.
 
 చైనా ఉల్లి చూడడానికి పెద్దగా, రుచి కూడా ఉంటుంది. 2010లో ఇలాగే ఉల్లి కొరత ఏర్పడినప్పుడు ముంబైకి చైనా నుంచి దిగుమతి అయిం ది. దీంతో ధరలు కొంత అదపులోకి వచ్చాయి. ఒకపక్క వివిధ ప్రాంతాల నుంచి ట్రక్కులు రాకపోవడంతో లాసల్‌గావ్ మార్కెట్లో ఉల్లి ధరలు 7.5 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. మరోపక్క ఎపీఎంసీకు చైనాతోపాటు కర్ణాటక, ఇతర రాష్ట్రా ల నుంచి పెద్ద సంఖ్యలో ఉల్లి రావడంతో కొత్త ఉల్లి కేజీకీ రూ.25-40 చొప్పున విక్రయిస్తున్నారు. త్వరలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వస్తాయని ఎపీఎంసీకి చెందిన ఉల్లి వ్యాపారి శివాజీ డెంబరే ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు