ప్రేమికులను కలిపిన సునామీ

4 Jan, 2015 02:31 IST|Sakshi
ప్రేమికులను కలిపిన సునామీ

 వేలాదిమంది పొట్టన పెట్టుకుని, లక్షలాదిమందిని భయభ్రాంతులకు గురి చేసిన సునామీ ఒక ప్రేమ జంటను మాత్రం కలిపింది. ఈ అంశంతో తెరకెక్కిన చిత్రం కయల్. మైనా, కుంకి చిత్రాల తరహాలో మరో వైవిధ్య భరిత ప్రేమ కథా చిత్రం ఇది. కొన్ని రోజులు కష్టపడి పనిచేసి సంపాదించుకున్న డబ్బుతో ఆనందంగా దేశ సంచారం చేసే ఒక యువకుడు అచ్చంగా తన లానే ఆలోచించే స్నేహితుడితో కలసి సంతోషంగా కాలాన్ని గడిపేస్తుంటాడు. అలా దేశాటనలో కన్యాకుమారి చేరుకున్న అతనికి అనూహ్య సంఘటనల మధ్య ఒక యువతి తారసపడుతుంది. ఇంతకుముందు ప్రేమించడానికి నచ్చిన అమ్మాయి కంటపడలేదన్న ఆ యువకుడు ఆ యువతిని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు.
 
 ఆ విషయాన్ని ధైర్యంగా ఆమెతో చెప్పేసి వెళ్లిపోతాడు. ఒక జమీందారు ఇంటిలో పని చేసే ఆ యువతి అతనిపై మనసు పడుతుంది. అయితే అతనెవరో, ఎక్కడ ఉంటాడో తెలియదు. అయినా అతనే తన జీవితం అంటూ ఇల్లు వదలి వచ్చేస్తుంది. ఆ తరువాత ఏమైంది? చివరికి ఎలా భగ్న ప్రేమికులు ఒకటయ్యారా? అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన కయల్ చిత్ర కథకు దర్శకుడు ప్రభుసాల్మన్ సునామీ నేపథ్యాన్ని అద్భుతంగా వాడుకున్నారు. కొత్త వాళ్లతో పాత్రలకు జీవం పోయించడంలో అందెవేసిన ప్రభుసాల్మన్ ఈ చిత్రంలోనూ ఒక హీరోయిన్ ఆనంది మినహా అందరినీ కొత్తవారినే ఎంచుకున్నారు.
 
 చిత్రం చివరి ఘట్టంలో సునామీ సన్నివేశాలు గ్రాఫిక్స్ అయినా అబ్బురపరిచేలా రూపొందించారు. ఆరణాల అచ్చ తెలుగమ్మాయి ఆనంది కథానాయికగా చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. నవ నటుడు చంద్రన్ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. గాడ్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్ ఆర్టిస్ట్ ఎస్.మదన్ విడుదల చేశారు. చిత్రం మంచి ప్రజాదరణతో ప్రదర్శితమవుతోంది.

 

మరిన్ని వార్తలు