సీఎస్‌గా జ్ఞానదేశికన్

3 Dec, 2014 03:02 IST|Sakshi
సీఎస్‌గా జ్ఞానదేశికన్

 సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్‌ను హఠాత్తుగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విద్యుత్ బోర్డు చైర్మన్ జ్ఞానదేశికన్‌ను సీఎస్‌గా రంగంలోకి దించారు. అలాగే, పలువురు సీనియర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌లను కలవరపాటుకు గురి చేసింది. షీలా బాలకృష్ణన్ పదవీ విరమణతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పగ్గాల్ని సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న మోహన్ వర్గీస్ సుంకత్ చేపట్టారు. సీఎస్‌గా మోహన్ వర్గీస్ బాధ్యతలు చేపట్టి 8 నెలలవుతోంది.
 
 ఇది వరకు ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వాళ్లందరూ పదవీ విరమణ పొంది ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారులుగా వ్యవహరించారు. షీలా బాలకృష్ణన్ అయితే, నేటికీ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి 8 నెలలే అవుతున్న మోహన్ వర్గీస్‌ను హఠాత్తుగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లను సైతం బదిలీ చేయడం ఐఏఎస్‌లను షాక్ గురి చేసింది. గురువారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సమయంలో ఏకంగా సీఎస్‌ను బదిలీ చేయడంతో ఏదేని కారణాలు ఉన్నాయా..? అన్న చర్చ  బయలు దేరి ఉన్నది.
 
 సీఎస్‌గా జ్ఞాన దేశికన్: తన బదిలీ, మరి కొందరు ఐఏఎస్‌ల స్థాన చలనం ఉత్తర్వుల్ని తానే స్వయంగా జారీ చేసుకుంటూ సీఎస్ హోదాలో మోహన్ వర్గీస్ సుంకత్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విద్యుత్ బోర్డు చైర్మన్ కె జ్ఞాన దేశికన్‌ను నియమించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. తన వద్ద అదనంగా ఉన్న విజిలెన్స్, అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ పదవులను సైతం జ్ఞానదేశికన్‌కు అప్పగించారు.  సీఎస్‌గా తప్పుకున్న మోహన్ వర్గీస్‌ను అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో అన్నా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డెరైక్టర్ జనర్‌ల్‌గా నియమించారు. ఈ పదవిలో ఉన్న ఇరై అన్భును ప్రధాన కార్యదర్శి హోదాలో ఆర్థిక, గణంకాల విభాగానికి బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న నిరంజన్ మార్డిన్‌ను తమిళనాడు మేరిటైం బోర్డుకు బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న రమేష్‌కుమార్ ఖన్నా పదవీ విరమణ పొందారు. జ్ఞానదేశికన్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ కావడంతో ఆయన చేతిలో ఉన్న విద్యుత్ బోర్డు చైర్మన్ పదవి ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి ఎంసాయి కుమార్‌ను వరించింది.
 
 స్థాన చలనం : గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎస్ పళనియప్పన్‌ను ప్రజా పనుల శాఖకు, రెవెన్యూ విభాగం ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు మార్చారు. టౌన్ ప్లానింగ్ విభాగం కమిషనర్ ఆర్ వెంకటేశన్‌ను రెవెన్యూ విభాగం కార్యదర్శిగా, యువజన సర్వీసుల విభాగం ప్రధాన కార్యదర్శి నజీముద్దీన్‌ను సహకార, ఆహార, వినియోగదారుల సంక్షేమ విభాగానికి, సమాచార సేకరణ విభాగం కమిషనర్ ధర్మేంద్ర ప్రతాప్‌యాదవ్‌ను హౌసింగ్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగానికి కార్యదర్శిగా స్థాన చలనం చేశారు. ఈ పదవిలో ఉన్న మోహన్ పేరిని యువజన సర్వీసుల విభాగానికి ,పుదుకోట్టై జిల్లా కలెక్టర్‌గా ఉన్న సీ మనోహరన్‌ను వ్యవసాయ శాఖ మార్కెటింగ్ విభాగం డెరైక్టర్‌గా, సహకార, ఆహార, వినియోగదారుల సంక్షేమ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంపీ నిర్మలను చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్(టాన్సీ) చైర్ పర్సన్‌గా నియమించారు.  
 

మరిన్ని వార్తలు