పరుగో.. పరుగు

20 Sep, 2016 12:15 IST|Sakshi
పరుగో.. పరుగు
  కొమురంభీం జిల్లాలో కార్యాలయ భవనాల వేట
  ఇది వరకే ప్రైవేట్ భవనాలు పక్కా చేసిన పలు శాఖలు
  ప్రభుత్వ భవనాలనే ఎంచుకోవాలన్న ఆర్డీవో
  ఇతర శాఖలకు ఇచ్చేందుకు పలు అధికారుల నిరాకరణ
  ఉన్న పలు డివిజన్ కార్యాలయాల్లో జిల్లా ఆఫీసులు
  బెల్లంపల్లి, మందమర్రి వైపు అధికారుల పరుగు
  ఖరారు కాని ఆర్డీవో కార్యాలయ భవనం..?
 
సాక్షి, మంచిర్యాల : కొత్తగా ఏర్పాటవుతున్న కొమురంభీం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పలు శాఖాధికారులకు సవాలుగా మారింది. కొత్త జిల్లాల ప్రారంభానికి సరిగ్గా ఇరవై రోజులే మిలిగి ఉంది. ఇప్పటి వరకు కేవలం కలెక్టర్, ఎస్పీ కార్యాలయ భవనాలు మాత్రమే ఖరారయ్యాయి. స్థానికంగా ఉన్న పలు డివిజన్ శాఖల భవనాల్లో ఆయా జిల్లా కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. కానీ డివిజన్ కార్యాలయాలు లేని శాఖలకు భవనాల ఏర్పాటు తలనొప్పి వ్యవహారంగా మారింది. దీంతో ఇప్పటికే పలు శాఖల అధికారులు కార్యాలయాల ఏర్పాటు కోసం మంచిర్యాల పట్టణంలో పలు ప్రైవేట్ భవనాలు ఎంపిక చేసి.. అద్దె కూడా ఖరారు చేసుకున్నారు. ప్రైవేట్ భవనాల్లో ఏర్పాటయ్యే కార్యాలయాల అద్దె రూ.4 వేల నుంచి రూ.6 వేలలోపు ఉండేలా చూడాలని అప్పట్లో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తాజాగా.. కొమురంభీం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఆ మేరకు భవనాల ఎంపిక చేయాలని ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం ఆదేశాలు జారీ చేయడంతో డివిజన్ పాటు జిల్లా స్థాయి అధికారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కొన్ని శాఖలకు మాత్రమే డివిజన్ కార్యాలయాలు ఉండడం.. ఆయా భవనాల్లో జిల్లా కార్యాలయాలు వస్తుండడంతో డివిజన్ కార్యాలయాలు ఇతర భవనాలకు తరలించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉన్న భవనాన్ని జిల్లా కార్యాలయానికి అప్పగిస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన డివిజన్ స్థాయి అధికారుల్లో వ్యక్తమవుతోంది. 
 
మరోపక్క.. ఇప్పటికీ పశుసంవర్థక, కార్మిక శాఖ, మైనింగ్, తూనికలు కొలతలు, సాంఘిక సంక్షేమం, ఆహార కల్తీ నిరోధక, ఔషధశాఖ, సేల్స్, కమర్షియల్, ఇన్‌కంటాక్స్, అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల, సబ్ ట్రెజరీ కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సొంత భవనాలు లేని డివిజన్ స్థాయి శాఖలు మంచిర్యాలలో మరెన్నో ఉన్నాయి. దీంతో ఆయా శాఖల అధికారులు జిల్లా కార్యాలయాల భవనాల అన్వేషణలో పడ్డారు. ఇప్పటికే పలు శాఖల అధికారులు పలు ప్రైవేట్ భవనాలను ఎంపిక చేసుకుని పెట్టుకున్నారు. తాజాగా.. ఆర్డీవో ఆదేశాలతో మళ్లీ ప్రభుత్వ భవనాలు వెతుక్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే.. కనీసం డివిజన్ స్థాయి కార్యాలయాలు లేని బీసీ, మైనార్టీ వెల్ఫేర్, కార్పొరేషన్లు, దేవాదాయ శాఖల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. వీటిలో ఇప్పటికే కొన్ని శాఖలు మాత్రమే భవనాలు చూసి పెట్టుకున్నారు. మిగిలిన శాఖలు ఇంకా భవనాల అన్వేషణలో వెనకబడే ఉన్నారు. ఇదిలావుంటే.. మంచిర్యాలలో ప్రభుత్వ కార్యాలయల భవనాల కొరత ఉండడంతో కొందరు అధికారులు మంచిర్యాలను ఆనుకుని ఉన్న బెల్లంపల్లి, మందమర్రి పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. మంచిర్యాల నుంచి 20 కి.మీల దూరంలో ఉన్న ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం.. సింగరేణి అతిథి గృహాలూ ఉండడంతో ఆయా ప్రాంతాల్లో జిల్లా శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్నామని జిల్లా స్థాయి అధికారి ఒకరు తెలిపారు.
 
ఆర్డీవో కార్యాలయ ఏర్పాటుపై సందిగ్ధం
మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ భవన ఎంపికలో సంది గ్ధత నెలకొంది. ప్రస్తుత సొంత భ వనంలో ఎస్పీ కార్యాల యం ఏర్పాటు కానుండడం.. ఆర్డీవో కార్యాలయాన్ని కొత్త కలెక్టరేట్ సముదాయంలోకి తరలించాలని ఇటీవల ఎంపీ బాల్కసుమన్ సూచించారు. ఇప్పటికే కలెక్టరేట్‌లో జేసీ, డీఆర్‌వో, ఏవో, సంబంధిత విభాగాలు, సమీక్ష, సమావేశ మందిరం, డీఆర్‌డీఏ, డ్వామా ఇతర శాఖలు ఏర్పాటుకానుండడంతో ఆర్డీవో కార్యాలయానికి స్థలాభావం సమస్య ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఐబీ చౌరస్తా వద్ద ఉన్న ఆర్‌అండ్‌బీ డీఈ అతిథిగృహంలో ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానం కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నించా రు. దీన్ని ఆ శాఖ అధికారి ఒకరు సున్నితంగా తిరస్కరించారు. అయినా.. ఆర్డీవో అదే భవనంలో కార్యాలయం ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. 
 
మరిన్ని వార్తలు