-

రాయచూరులో కుండపోత

16 Sep, 2013 03:43 IST|Sakshi

రాయచూరు / రాయచూరు సిటీ , న్యూస్‌లైన్ : నైరుతి రుతుపవనాలు తిరుగు ప్రయాణంలో రాయచూరును అతలాకుతలం చేశాయి. శనివారం రాత్రి నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు సకాలంలో స్పందించలేదని జాతీయ రహదారిపై గ్రామస్తులు రాస్తారోకో చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు గుడిసెలు కూలి ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు గాయపడ్డారు. వందలాది ఇళ్లు జలమయమయ్యాయి. వేలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది.

రాత్రంతా ప్రజలు జాగరణ చేయక తప్పలేదు. శనివారం రాత్రి 11 గంటల నుంచి కురిసిన వర్షం దాదాపు రెండు మూడు గంటల పాటు వివిధ ప్రాంతాలన్నింటినీ అతలాకుతలం చేసింది. జలాల్‌నగర్‌లో ఐదు గుడిసెలు కూలిపోయాయి. దీంతో స్థానికంగా ఉంటున్న భీమణ్ణ అనే యువకుడి కాలు విరగ్గా పద్మమ్మ అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని జిల్లా ఆస్పత్రికి తరలించారు.

పిడుగులు, ఉరుముల గర్జన కు తోడు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలైన నీరుబావి కుంట, జలాల్‌నగర్ లేఔట్‌లోని ఇళ్లల్లో రెండు మూడు అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వీరి పరిస్థితి చూడనలవి కాదు. తట్ట బుట్ట పిల్లజల్లని చేతపట్టుకుని ఎత్తైన ప్రాంతం కోసం పరుగులు తీశారు. బసవనబావి సర్కిల్ నుంచి రాజేంద్రగంజ్ రోడ్డు మధ్యలోని మున్నూరువాడి స్కూల్ ఎదుట నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో ఉదయం వరకు వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ముఖ్యంగా మురికి కాలువలన్నీ పూడికలతో నిండి ఉండటంతో స్థలాల ఆక్రమణ, మురికి కాలువలపై ఇళ్ల నిర్మాణం, ఫలితంగా నీరుబావికుంట, జలాల్‌నగర్ ఇళ్లు జలమయమయ్యాయి. సమీపంలో హెగ్గసనహళ్లిలోని కోణద వాగు నిండి ప్రవాహం ముంచెత్తింది. ఐదేళ్ల క్రితం ఇదే రీతిలో ప్రజలు ఆందోళన చెందారు. ప్రస్తుతం అదే విధంగా వ ంకలో భారీ స్థాయిలో పిచ్చి మొక్కలు, పూడిక విపరీతంగా పెరిగిపోయింది. దీంతో వ ర్షం నీరంతా ఊరు మీద పడింది. దీంతో ఆ గ్రామంలోని ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వేలాది ఎకరాలు నీటమునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇంత తీవ్ర నష్టం జరుగుతున్నా తగు రీతిలో స్పందించలేదన్న ఆగ్రహంతో అక్కడి ప్రజలు రాయచూరు-హైదరాబాద్ రోడ్డుపై రాస్తారోకో జరిపారు. ఈ వాగు వల్ల తాము వర్షాకాలంలో పడరాని పాట్లు పడుతున్నామని, తీవ్రంగా నష్టపోయాని వాపోయారు. తక్షణం పరిహార పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాయచూరు తహశీల్దార్ చామనూరు ప్రజలకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. అసిస్టెంట్ కమిషనర్ ఎన్.మంజుశ్రీ ప్రజలను ఓదార్చేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రెండు గంటల పాటు రాస్తారోకో జరిగింది. రెండవ శనివారం, ఆదివారం సెలవు కావడంతో జెడ్పీ, ఇతర రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడం సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి.
 

మరిన్ని వార్తలు