కలకలం

30 Mar, 2018 10:41 IST|Sakshi
ఎదురుకాల్పుల్లో  పాల్గొన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు  

కొందమాల్‌లో ఎదురు కాల్పులు

మావోయిస్టుల శిబిరం ధ్వంసం

భారీ డంప్‌ స్వాధీనం

బరంపురం : మావోయిస్టుల దుర్గంగా ఉన్న కొందమాల్‌ జిల్లాలో  ఒక్కసారిగా యుద్ధవాతావరణం అలుముకుంది.  కొద్ది కాలంగా ప్రశాంతంగా ఉన్న జిల్లాలో   జరిగిన ఎదురు కాల్పులు భయానక పరిస్థితులను సృష్టించాయి. కొందమాల్‌ జిల్లాలో పోలీసులు, మవోయిస్టుల మధ్య   జరిగిన ఎదురు కాల్పుల్లో ఎదురు కాల్పుల్లో మావోయిస్టు శిబిరాన్ని పోలీసులు పూర్తిగా ధ్వంసం చేశారు. అనంతరం భారీ  డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనతో గంజాం, గజపతి, కొందమాల్‌ జిల్లాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందమాల్‌ ఎస్‌పీ ప్రత్తిక్‌ సింగ్‌ అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

కొందమాల్‌ జిల్లా కొజ్జిరిపడ సమితి లంబాగుడా పంచాయతీ కుకులసెలయేరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల శిబిరంలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు  సమాచారం అందుకున్న ఎస్‌ఓడీ జవాన్‌లు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు, స్థానిక పోలీసుల సహాయంతో బుధవారం కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో హఠాత్తుగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. సూమారు 2 గంటల వరకు ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు సాగిన అనంతరం మవోయిస్టులు వెనక్కు తగ్గి దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయారు.

అనంతరం సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు మావోయిస్టుల శిబిరాన్ని పరిశీలించి భారీ డంప్‌ను గుర్తించి విస్ఫోట సామగ్రి, అయుధాలు స్వాధీనం  చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంప్‌లో మావోయిస్టు జెండాలు, ఒక సీఎల్‌ఆర్‌ మెషీన్, రెండు కుర్చీలు, రెండు రేడియోలు, తాగునీటి బాటిల్స్, ఔషధాలు, 3 జతల చెప్పులు, వివిధ సామగ్రి ఉన్నట్లు ఎస్‌పీ ప్రత్తిక్‌ సింగ్‌ తెలియజేశారు. కొందమాల్‌ జిల్లాలో కొందమాల్, కలహండి, బౌధ్, నయగడ్‌ (కేకేబీఎన్‌)డివిజన్‌ దళం సీపీఐ మావోయిస్టు ఆధ్వర్యంలో  మావోయిస్టుల కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు, శిబిరంలో మహిళా క్యాడర్‌తో పాటు సుమారు 14 మంది మవోయిస్టులు ఉన్నట్లు ఎస్‌పీ వివరించారు.  

జోరుగా కూంబింగ్‌ జరిగిన సంఘటపై కొందమాల్‌ జిల్లాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కమనకొలొ, లొండిగాం, గొచ్చపడా, బలందపూర్, దసపల్లా, రాణిపొత్తర, గస్మా, గెలరీ, శ్రీరామ్‌పూర్, దరింగబడి, సాలిమాగచ్‌ అటవీ ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహాయంతో సీఆర్‌పీఎఫ్, ఎస్‌ఓజీ జవాన్‌లు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నట్లు కొందమాల్‌ ఎస్‌పీ ప్రత్తిక్‌ సింగ్‌ తెలియజేస్తున్నారు. గంజాం, గజపతి, కొందమాల్‌ జిల్లాల సరిహద్దుల్లో వచ్చి పోయే వాహనాలను,   ప్రయాణికుల బస్సులను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎస్‌ఓజీ జవాన్‌ల సహకారంతో స్థానిక పోలీసులు కూడా సోదాలు చేస్తున్నారు.జేసీబీ, 3ట్రాక్టర్ల కాల్చివేత

కొందమాల్‌ జిల్లాలో మావోయిస్టుల విధ్వంసం
రాయగడ : జిల్లా సరిహద్దులో గల కొందమాల్‌ జిల్లా బలిగుడ పోలీస్‌స్టేషన్‌ పరిధి గుమ్మడ మహరోడ్డు కుర్తింగుడ దగ్గరలో బుధవారం అర్ధరాత్రి 40మంది సాయుధ మావోయిస్టులు రోడ్డు నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఒక జేసీబీ, 3ట్రాక్టర్లను కాల్చివేశారు.  ఈ సందర్భంగా మావోయిస్టులు పలు ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. జినుగు నరసింగరెడ్డి అనే వ్యక్తి మావోయిస్టుల సమాచారాన్ని  పోలీసులకు చేరవేస్తున్నాడని..దీనిపై ప్రజాకోర్టులో విచారించి తగిన చర్యలు చేపడతామని కేకేబీఎన్‌ డివిజన్‌ మావోయిస్టులు  పోస్టర్లలో హెచ్చరించారు.

అలాగే ప్రజలు కోరుకున్న విధంగా 6నుంచి 8 అడుగుల రహదారి మాత్రమే నిర్మించాలి. రహదారిపనులను గ్రామీణ ప్రజల ద్వారా చేపట్టాలి. మెషినరీతో పనులు చేపట్టకూడదు. రోజుకూలి రూ.200కు బదులు రూ.1200 చెల్లించాలి. వారానికి ఒకసారి పేమెంట్‌ చెల్లించాలని పోస్టర్లలో మావోయిస్టులు డిమాండ్‌ చేశారు.   గ్రామీణ ప్రాంతంలో విదేశీ మద్యం నిర్మూలించేందుకు మహిళలు ఉద్యమాలు చేపట్టాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.  


 

మరిన్ని వార్తలు