భీకరస్థాయికి యుద్ధం?.. గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ సైన్యం.. హమాస్‌ కౌంటర్‌ వార్నింగ్‌

3 Nov, 2023 08:41 IST|Sakshi

ఇజ్రాయెల్‌-హమాస్ మధ్య యుద్ధం భీకరస్థాయికి చేరిందా?. హమాస్‌ ఆధీనంలో ఉన్న గాజా నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టినట్లు శుక్రవారం ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించుకుంది. దీంతో ఏ క్షణమైనా అన్నివైపుల నుంచి భూతల దాడులకు పాల్పడొచ్చనే సంకేతాలు పంపింది. మరోవైపు అలాంటిదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హమాస్‌ కౌంటర్‌ వార్నింగ్‌ ఇచ్చింది.

గాజా నగరాన్ని ఇజ్రాయెల్‌ సైన్యం నాలుగు వైపులా చుట్టుముట్టింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ సైన్య ప్రతినిధి డేనియల్‌ హగారి అధికారికంగా ప్రకటించారు. తాము సిద్ధంగా ఉన్నామని, భూతల దాడులు చేపట్టేందుకు రక్షణ దళం నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారాయన. మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన ప్రకటనకు హమాస్‌ కౌంటర్‌ ఇచ్చింది. గాజాలోకి ఇజ్రాయెల్‌ సైనికులు ప్రవేశిస్తే.. నల్ల సంచుల్లో శవాలుగానే తిరిగి వెళ్తారంటూ హెచ్చరించింది. ఈ మేరకు హమాస్‌ సైన్యప్రతినిధి ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితుల దృష్ట్యా గాజాలో కాల్పుల విరమణ పాటించాలని, దాడులు ఆపాలని ఐక్యరాజ్య సమితి పిలుపు ఇచ్చింది. అయితే ఆ పిలుపును ఇజ్రాయెల్‌ కఠినవైఖరితోనే తిరస్కరించింది. తాజాగా గాజాలో భూతల దాడులకు సిద్ధమైన నేపథ్యంలోనూ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌ స్పందించింది. అలాంటి ఆలోచనేం లేదని, హమాస్‌ను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టడమే తమ ధ్యేయమని ఇజ్రాయెల్‌ సైన్య ప్రతినిధి డేనియల్‌ హగారి ప్రకటించారు. 

మరోవైపు అమెరికా మాత్రం కాల్పుల విరమణకు బదులు.. యుద్ధ విరామం అవసరమని అభిప్రాయపడుతోంది. గాజా ప్రజలకు మానవతా సాయం అందడం, హమాస్‌ చెరలో బందీలుగా ఉన్నవాళ్లను విడిపించాలంటే ఈ యుద్దానికి విరామం అవసరమేనని అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ప్రకటించారు.

అక్టోబర్‌ 7వ తేదీన రాకెట్‌ లాంచర్లతో హమాస్‌ బలగాలు, ఇజ్రాయెల్‌ సరిహద్దుల్లో మెరుపు దాడికి దిగాయి. కొన్ని ప్రాంతాలను తమ అదుపులోకి తీసుకున్నాయి. హమాస్‌ దాడుల్లో 1,400 మంది మరణించినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అత్యాధునిక యుద్ధ వ్యవస్థ ఉన్న ఇజ్రాయెల్‌.. ఈ దాడిని ఘోర అవమానంగా భావించింది. ఆపై ప్రతిదాడులకు దిగింది. హమాస్‌ స్వాధీనంలో ఉన్న గాజాపై ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 9వేల మందికిపైగా మృతి చెందారు. ఇందులో సగం చిన్నారులే ఉండడం గమనార్హం. మృతుల సంఖ్య పెరిగిపోతుండడంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అయితే పాశ్చాత్య దేశాల మద్దతుతో ఇజ్రాయెల్‌ తమ దాడుల్ని కొనసాగిస్తుండగా.. మరోవైపు పాలస్తీనా సంస్థ హమాస్‌కు ఇరాన్‌ సహా పలు దేశాలు అండగా నిలుస్తున్నాయి.

మరిన్ని వార్తలు