వాడివేడిగా అసెంబ్లీ సమావేశాలు

25 Oct, 2013 23:19 IST|Sakshi

 అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఒక్కసారిగా వేడెక్కాయి. అన్నాడీఎంకేపై డీఎంకే ధ్వజమెత్తింది. ఈ క్రమంలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపారు. రాష్ట్రంలో వచ్చే ఏడాదికి మిగులు విద్యుత్ ఉంటుందని ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి:
 అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యూయి. తొలిరోజు సంతాప తీర్మానంతో సభ వాదా పడింది. రెండో రోజు ప్రశాంత వాతావరణంలో సభ నడిచింది. అయితే శుక్రవారం సభ ఒక్కసారిగా వేడెక్కింది. వాటర్ బాటిళ్లు, బస్సులపై రెండాకుల చిహ్నంపై అసెంబ్లీలో చర్చించేందుకు  అవకాశం ఇవ్వాలని డీఎంకే సభ్యులు దురైమురుగన్ కోరగా స్పీకర్ ధనపాల్ నిరాకరించారు. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చినందున చర్చకు తావులేదని తోసిపుచ్చారు. అవకాశం ఇవ్వాల్సిందేనంటూ డీఎంకే సభ్యులంతా లేచి నిలబడి నినాదాలు హోరెత్తించారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
 
 సభలోనే ఉన్న జయలలిత ప్రతిపక్ష సభ్యుల విమర్శలను తిప్పికొట్టే బాధ్యతను అధికార పార్టీ సభ్యులకే అప్పగించి మిన్నకుండిపోయారు. ఇదే సమయంలో స్టాలిన్ కలుగజేసుకుని తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు స్పీకర్ నిరాక రించారు. వెంటనే డీఎంకే సభ్యులు తమ వద్దనున్న మినీబస్‌ల ఫొటోలను తలపై ఎత్తిపట్టుకుని నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించినా పరిస్థితిలో మార్పు లేదు. చివరకు స్పీకర్ ఆదేశంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేసి డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపారు.
 
 పార్టీ ప్రచారం చేసుకోలేదు
 అసెంబ్లీలో లాబీలో డీఎంకే నేత దురైమురుగన్ మాట్లాడారు. ప్రతిపక్షాల విమర్శలు, అభ్యంతరాలను ప్రభుత్వం స్వీకరించి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండేదన్నారు. డీఎంకే హయాంలో ప్రభుత్వ డైరీపై కరుణానిధి ఫొటో, అన్నా సమాధి వద్ద ఉదయించే సూర్యుని చిహ్నం వేసుకోలేదా అని అన్నాడీఎంకే సభ్యులు సభలో వేసిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. అవి తమకు తెలియకుండా జరిగాయని, పొరబాట్లను వెంటనే సరిదిద్దుకున్నామని వివరించారు. అన్ని చోట్లా అమ్మ ఫొటో, రెండాకులు వేసుకుంటున్నారు, క్వార్టర్ బాటిళ్లపై వేసుకోవడం లేదేమిటంటూ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినవారు అసెంబ్లీ నుంచి వైదొలగే రోజులు త్వరలోనే వస్తాయని వ్యాఖ్యానించారు. అనంతరం డీఎంకే కోశాధికారి, ఎమ్మెల్యే స్టాలిన్ మాట్లాడారు. తమ పాలన లోనూ అనేక మంచినీటి పథకాలు ప్రవేశపెట్టామని, అరుుతే ఎక్కడా పార్టీ ప్రచారం చేసుకోలేదని పేర్కొన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వం మంచినీటి బాటిళ్లపై, బస్సులపైనా రెండాకుల చిహ్నాన్ని ముద్రించి వ్యాపారం చేసుకుంటోందని విమర్శించారు.
 
 రూ5,900 కోట్ల మినీ బడ్జెట్
 ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం రూ5900 కోట్లతో మినీ బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. 2013-14 సంవత్సరానికి మార్చి 21న బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నామని సభకు తెలిపారు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పథకాలు, ఇతర ఖర్చులు ఎదురైనందున మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా పేదలకు ఉచితంగా పంచె, చీర పంపిణీకి రూ350 కోట్లు కేటాయించామన్నారు. అయితే నూలు ధర పెరగడం వల్ల రూ136.36 కోట్లు అదనంగా అవసరమైందని వివరణ ఇచ్చారు.
 
 ముందుంది మంచికాలం
 వచ్చే ఏడాది ఆరంభం నాటికి రాష్ట్రం మిగులు విద్యుత్ స్థితికి చేరుకుంటుందని ముఖ్యమంత్రి జయలలిత అసెంబ్లీలో ప్రకటించారు. సీపీఐ సభ్యులు ఆర్ముగం మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కోతలు తగ్గినా చిన్నత రహా పరిశ్రమలు, రైతులు కోతల వెతలను ఎదుర్కొంటున్నారని అన్నారు. జయలలిత స్పందిస్తూ తమ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ పరిస్థితి మరీ దారుణంగా లేదని అన్నారు. రాష్ట్రం 2006 వరకు మిగులు విద్యుత్‌లో ఉండేదని, తర్వాత అధికారంలోకి వచ్చిన డీఎంకే రాష్ట్రాన్ని కోతలపాలు చేసిందని ఆరోపించారు. 2011లో తాను అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ సమస్య పరిష్కారంపై తీవ్రంగా దృష్టి సారించానని పేర్కొన్నారు. తాము తీసుకుంటోన్న చర్యలు ఈ ఏడాది చివరినాటికి ఫలితాలను ఇవ్వడం మొదలవుతుందని, 2014 ఆరంభంలో మిగులు విద్యుత్ స్థితికి చేరుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చిన్నతరహా పరిశ్రమలపై కోతలను పూర్తిగా ఎత్తేశామన్నారు. భారీ పరిశ్రమలకు కోతలను 40 నుంచి 20 శాతానికి తగ్గించామని వివరించారు. డెల్టా జిల్లాల రైతులకు 12 గంటలు, ఇతర జిల్లాల్లోని రైతులకు 9 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని జయలలిత తెలియజేశారు.

మరిన్ని వార్తలు